
నిపా వైరస్ నమూనా సేకరిస్తోన్న వైద్య సిబ్బంది
సాక్షి, తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్‌లో మే 17వ తేదీన తెల్లవారు జామున రెండు గంటలకు బేబీ మెమోరియల్ ఆస్పత్రికి అనారోగ్యంతో బాధ పడుతున్న ముహమ్మద్ సలీహ్‌ను తీసుకొచ్చారు. అప్పుడు అతని రక్తపోటు ఎక్కువ, తక్కువ అవుతోంది. గుండె కొట్టుకోవడం కూడా లయ తప్పింది. అతనికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. అంతుపట్టని లక్షణాలతో వచ్చిన అతనికి వైద్యం అందించేందుకు ఆస్పత్రి వర్గాలు ఆరుగురితో ఓ వైద్య బందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందంలో న్యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సీ. జయకృష్ణన్ కూడా ఉన్నారు. ఆయనకు వివిధ జబ్బులు, వైరస్‌ల గురించి తెలియజేసే పుస్తకాలు, మాగజైన్లు చదవడం అలవాటు.
ఆ అలవాటులో భాగంగా ఆయన నెల రోజుల క్రితమే అత్యంత ప్రాణాంతకమైన ‘నిపా’ వైరస్ గురించి చదివాడు. ముహమ్మద్ లక్షణాలను గమనించగానే డాక్టర్ జయకష్ణన్‌కు నిపా వైరస్ గురించి గుర్తువచ్చింది. వెంటనే ఈ విషయమై తోటి డాక్టర్లను అప్రమత్తం చేశారు. వారు వెంటనే రోగి వెన్నుముక నుంచి, గొంతు నుంచి స్రావాన్ని వెలికి తీసి, వాటితోపాటు రక్తం, మూత్రం నమూనాలను కూడా మే 18వ తేదీన మణిపాల్‌లోని ‘సెంటర్ ఫర్ వైరస్ రీసర్చ్’కు పంపించారు. వైద్య రంగంలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వైద్యులు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. భారత వైద్య మండలి కూడా డాక్టర్లు వైద్యరంగంలో వచ్చే రోజువారి పరిణామాలను తెలుసుకోవాలని చెబుతోంది కానీ అందుకు నిర్బంధం ఏమీ లేదు. అమెరికాలో పదేళ్లకోసారి వైద్యులు తాజా పరిణామాలపై పరీక్ష పాస్ కావాల్సిందే. కాకపోతే పట్టా రద్దవుతుంది. డాక్టర్ జయకృష్ణన్ స్వతహాగా చదువుకోవడం వల్ల నిపా గురించి తెలుసుకోగలిగారు.
మలేసియాలో మొట్టమొదటి సారిగా 1998లో కనుగొన్న ఈ వైరస్ గురించి భారత్‌లో కూడా పెద్దగా ఎక్కువగా తెలియదు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 2001లో, 2007లో నాడియాలో బయట పడింది. ఈ రెండు నగరాల్లో కలిసి 71 మందికి ఈ వైరస్ సోకగా వారిలో దాదాపు 50 మంది మరణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నిపా వైరస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు కేరళలో 14 మంది మరణించారు. వారంతా కోజికోడ్, మురప్పురం జిల్లాలకు చెందిన వారు. శాంపిల్స్‌లో నిపా వైరస్ ఉందా, లేదా అన్న విషయాన్ని కనుగొనేందుకు ఓ లాబోరేటరీకి ఆరేడు గంటల సమయం పడుతుంది.
300 కిలోమీటర్ల దూరంలోని మణిపాల్ వైరస్ పరిశోధనా కేంద్రం నుంచి ల్యాబ్ రిపోర్టులు కొరియర్‌లో బేబి మెమోరియల్ ఆస్పత్రికి రావడానికి కనీసం రెండు రోజులు పడతుంది. అంతసేపు నిరీక్షించడం కుదరదు కనుక ఈ విషయాన్ని ముహమ్మద్ బంధువులకు తెలియజేయగా, వారే స్వయంగా ల్యాబ్ రిపోర్ట్‌లు తేవడానికి వెళ్లారు. గంట గంటకు ముహమ్మద్ పరిస్థితి క్షీణిస్తుండడంతో డాక్టర్ జయకృష్ణన్ మణిపాల్ ల్యాబ్‌కు ఫోన్‌చేసి కనుగొన్నారు. ల్యాబ్ వారు ప్రాథమికంగా ‘నిపా’ వైరస్ అని చెప్పారు. వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకపోయింది. ముహమ్మద్ మరణించారు.
ఆ లక్షణాలు కలిగిన వారు ముహమ్మద్ ఇంట్లో మరెవరైనా ఉన్నారా? అంటూ డాక్టర్ జయకష్ణన్ వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అవే లక్షణాలతో ముహమ్మద్ సోదరుడు ముహమ్మద్ సబీద్ మే 5వ తేదీన మరణించినట్లు వారు చెప్పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ముహమ్మద్ తండ్రి వలసుకెట్టి మూసా, ఆయన మేనత్త మరియమ్‌ను ఆస్పత్రికి రప్పించి వారికి వైద్య చికిత్సలు ప్రారంభించారు. మరియమ్ 19వ తేదీన, మూసా 24వ తేదీన మరణించారు. వాస్తవానికి నిపా వైరస్ నివారణకు ఎలాంటి వ్యాక్సిన్‌గానీ, సరైన మందుగాని ఇంతవరకు లేదు. రోగి లక్షణాలు బట్టి గుండె, ఊపిరితిత్తులు, మెదడు దెబ్బ తినకుండా ఒక్కో అవయవానికి ఒక్కో చికిత్సను అందిస్తారు.
‘నిపా’ వైరస్ లక్షణాలు
జ్వరం వచ్చి గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి వస్తుంది. వాంతులు కూడా అవుతాయి. మెల్లగా మెదడు జన్యువులు దెబ్బతింటాయి. తర్వాత క్రమంలో గుండె, రక్తపోటు లయ తప్పుతుంది. మెదడు జన్యువులు దెబ్బతినడం ప్రారంభమైతే తల తిరుగుతున్నట్లు, మత్తు ఎక్కుతున్నట్లు ఉంటుంది. మూర్ఛ రోగం వస్తుంది. కోమాలోకి కూడా వెళ్లవచ్చు. నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాలతో వ్యాప్తి చెందుతుంది. నిపా వైరస్ కలిగిన గబ్బిలాలు కొరికిన పండ్లు, ఫలాలు తిన్నా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది.
కల్లు తాగినా వస్తుంది.
కల్లు తాగడం వల్ల కూడా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చెట్టుపైన కల్లు కుండల్లో గబ్బిలాల మూత్రం లేదా నోటి లాలాజలం కలిసినా కల్లులోకి నిపా వైరస్ చేరుతుంది. దాన్ని తాగడం వల్ల మనుషులకు వైరస్ సోకుతుంది. అయితే కల్లును వేడిచేసుకొని తాగితే ఏం కాదట. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే జంతువులు, మనుషులు కొరికిన లేదా ఎంగిలి చేసిన పండ్లు, తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. పండ్లను శుభ్రంగా కడగాలి. తిన్నప్పుడు, తాగినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బయటి జ్యూస్‌ను తాగకపోవడమే ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment