
నిఫా వైరస్. ఈ పేరు వింటే ఒక్క కేరళయే కాదు దేశమంతా ఉలిక్కి పడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌కి మందుల్లేకపోవడమే అందుకు కారణం. అయితే వైరస్ సోకినప్పుడు అందరికీ ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని గుర్తించడంలోనూ ప్రతిసారీ జరుగుతున్న ఆలస్యం అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. అయితే ఈసారి మాత్రం కేరళలో ఈ వైరస్ ఆనవాళ్లను సకాలంలో గుర్తించడంలో అక్కడి వైద్యుల బృందం సఫలీకృతం అయ్యింది. అందుకు ఓ వైద్యుడి పఠనాసక్తి కారణమైంది.
కేరళని కుదిపేసిన ప్రాణాంతక నిఫా వైరస్ తొలిసారి భారత దేశంలోకి ప్రవేశించినపుడు పశ్చిమ బెంగాల్‌లో పది రోజుల్లో 45 మందిని మింగేసింది. అంతకన్నా ముందు 20 ఏళ్ల క్రితం 1999లో మలేషియాలోని సంఘై నిఫా అనే ప్రాంతంలో ఈ వైరస్ తొలిసారి బయటపడ్డప్పుడు కూడా దీని బారినపడి అనేక మంది మృత్యువాత పడ్డారు. కేరళలో మాత్రం ఇప్పటి వరకు 12 మంది మరణించారు. ఇప్పటికింకా ఈ వైరస్‌కి మందులు లేవు. అయితే దీన్ని సరైన సమయంలో గుర్తించి, తగు జాగ్రత్తలతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అరికట్టడమొక్కటే పరిష్కారం. అయితే కేరళలో నిఫా వైరస్ ఆనవాళ్లను అతి త్వరగా కనిపెట్టగలడానికి కేరళలోని జయకృష్ణ అనే వైద్యుడు, అతని బృందం కారణమయ్యారు.
సరిగ్గా నెల రోజుల క్రితమే మెదడు వాపుకి కారణమయ్యే వివిధ రకాల వైరస్‌లకు సంబంధించిన పుస్తకాన్ని డాక్టర్ జయకృష్ణ చదివారట. ఆ పుస్తకంలో నిఫా వైరస్‌కి సంబంధించిన లక్షణాలు, కేరళలోవైరస్ సోకిన వ్యక్తిలో గుర్తించిన లక్షణాలూ ఒకే రకంగా ఉండటం ఆ వైద్యుడినీ, అతడి బృందాన్నీ తక్షణమే స్పందించేలా చేసింది. రాబోయే ప్రమాదాన్నిముందుగానే పసిగట్టి 48గంటల్లోపే వైరస్ నిర్దారణకు ఉపయోగపడింది. ఇదే కేరళ ప్రభుత్వాన్ని, అక్కడి వైద్య బృందాన్నీ డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలందుకునేలా చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖా మంత్రి కేకే శైలజ మీడియాకు వెల్లడించారు.