సాక్షి, న్యూఢిల్లీ : షెడ్యూలు ప్రాంతాల్లో రిజర్వేషన్లు వంద శాతం ఉండడం ఆయా ప్రాంతాల ప్రజలకు ఎలా ఉపకరిస్తాయో చెప్పాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో నూటికి నూరు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం క్రితం ఇచ్చిన జీవోను సమర్థిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ షెడ్యూలు ఏరియాలో రిజర్వేషన్లు 100 శాతం ఉండడం సహేతుకమేనని వాదించారు.
రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ఇందుకు అనుమతిస్తోంని తెలిపారు. రిజర్వేషన్లు ప్రతి పదేళ్లకోసారి పొడిగిస్తున్నారని, దీనికి రాజ్యాంగం వీలు కల్పిస్తుందా అంటూ, తొలుత పదేళ్లపాటే రిజర్వేషన్లని ఎందుకు పెట్టారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశం ఆర్టికల్ 334 పరిధిలోనిదని రాజీవ్ ధావన్ నివేదించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఐదో షెడ్యూలు విషయంలో ఎలాంటి కాల పరిమితి లేదా అని ప్రశ్నించింది. దీన్ని పార్లమెంటు సవరణ చేయొచ్చని వివరించారు. ఈ సందర్భంలో ధర్మాసనం కొన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెంది రిజర్వేషన్లు వదులుకోవాలనుకుంటే మార్గాలేమిటని పలు కీలక ప్రశ్నలు సంధించింది. దీనికి ధావన్ సమాధానం ఇస్తూ దానిపై తాను అభిప్రాయం చెప్పలేనని, దీనిని సమీక్షించడానికి ఆదివాసీ కౌన్సిళ్లు, గవర్నర్, రాష్ట్రపతి, కేంద్ర కమిషన్, రాష్ట్ర కమిషన్ ఉన్నాయని వివరించారు.
షెడ్యూలు ఏరియాకు మేలు చేస్తుంది..: ఏపీ
ప్రభుత్వ ఉత్తర్వు షెడ్యూలు ఏరియాకు, షెడ్యూలు తెగలకు సంయుక్తంగా మేలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాది జీఎన్ రెడ్డి వాదించారు. స్థానిక ఎస్టీలకు మేలు చేసి, ఇతరులపై వివక్ష చూపాలని సదరు జీవో తేలేదని నివేదించారు. ఆ ప్రాంతాల్లో విద్యా రంగ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు వివరించారు. ఈ జీవో ఆర్టికల్ 14, ఆర్టికల్ 16(1) పరిధిలో పరిశీలించాల్సిన అవసరం లేదని వివరించారు. ఆర్టికల్ 371 డి, షెడ్యూలు ఐదు, ప్రస్తుత జీవో మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తదని వాదించారు. షెడ్యూలు ఏరియా విశాల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లు అయినందున ఇవి అధిక రిజర్వేషన్లు అన్న ప్రశ్నను రేకెత్తనివ్వవని పేర్కొన్నారు.
సామాజిక, ఆర్థిక న్యాయానికి ఉపకరిస్తాయా?
‘అసలు వారు కోరుకుంటున్నదేంటి? సామాజిక, ఆర్థిక న్యాయమే కదా.. మరి ఈ వంద శాతం రిజర్వేషన్లు ఎలా ఇందుకు సహకరిస్తాయి? షెడ్యూలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అర్హులు తగినంతగా లేనప్పుడు వంద శాతం రిజర్వేషన్ల కల్పన ఎలా ఉపకరిస్తుంది? అని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నించారు. ఇలా చేయడం వారిని వెనకబడేలా చేయడమే కాకుండా ఇతర అర్హులైన వారి అవకాశాలను మూసివేయడమే కదా అని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు. దశాబ్దాలుగా గిరిజనుల పరిస్థితి రిజర్వేషన్ల వల్ల ఏమైనా మెరుగుపడిందా? ఇందుకు సంబంధించిన గణాంకాలు ఏవైనా ఉన్నాయా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదావేసింది.
ఆ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు ఎలా ఉపకరిస్తాయి?
Published Thu, Feb 13 2020 1:33 AM | Last Updated on Thu, Feb 13 2020 1:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment