
రేపిస్టులను పట్టిచ్చిన బాలిక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారి ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని బాధితురాలు గుర్తించడంతో పోలీసుల పని సులువైంది. మందవలి ప్రాంతంలో ఇంటి ముందు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకుపోయి ఆదివారం రాత్రి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను ఇంటి ముందు వదిలేసి పారిపోయారు.
నిందితుల్లో ఒకరైన ఆమిర్ నవ్వును చిన్నారి గుర్తుపట్టింది. ఆరు నెలల క్రితం తన అన్నయ్యతో ఆమిర్ గొడవ పడ్డాడని వెల్లడించింది. బాలిక ఇచ్చిన క్లూ ఆధారంగా రంగంలోకి 25 మంది పోలీసులు సోమవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
బైకు విషయంలో తన కొడుకుతో నిందితులు గతంలో గొడవపడ్డారని బాలిక తండ్రి తెలిపారు. ఈ కోపంతోనే తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడివుంటారని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.