
‘ఆ రోజు హింస జరిగితే నాకు సంబంధం లేదు’
కోల్‌కతా : మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో ఒక వేళ హింస జరిగితే బాధ్యత తనది కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మొహర్రం రోజున దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై బెంగాల్ ప్రభుత్వం నిషేదం విధించగా హైకోర్టు దానిని ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు.
మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంపై నిషేధాన్ని కోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయరాదని స్పష్టం కూడా చేసింది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహరం రోజుతో సహా అన్ని రోజులూ అర్థరాత్రి 12 గంటల వరకూ అనుమతించింది. నిమజ్జనానికి, తజియా ఊరేగింపుకూ రూట్ మ్యాప్ ఖరారు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పౌరుల హక్కులను ఆలోచనారహితంగా నియంత్రించరాదని ప్రభుత్వానికి చురకలు అంటించింది. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేసిందని వ్యాఖ్యానించింది. అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా ఆదేశాలిస్తారా అంటూ నిలదీసింది.