
ఇంత స్పందన ఊహించలేదు
యోగా కోసం తానిచ్చిన పిలుపునకు ప్రపంచం నలుమూలల నుంచి ఇంత విస్తృత స్పందన వస్తుందని ఊహించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
యోగాపై ప్రధాని నరేంద్ర మోదీ
- యోగా శారీరక వ్యాయామాన్ని మించిన ప్రక్రియ
- స్థిరత్వం, పరిపూర్ణత యోగాతోనే సాధ్యమని వీడియో సందేశం
- జూన్ 21న దేశవ్యాప్త కార్యక్రమాల్లో 57 మంది మంత్రులు
న్యూఢిల్లీ: యోగా కోసం తానిచ్చిన పిలుపునకు ప్రపంచం నలుమూలల నుంచి ఇంత విస్తృత స్పందన వస్తుందని ఊహించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యోగా శారీరక వ్యాయామాన్ని మించిన ప్రక్రియ అని పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం వీడియో సందేశం ద్వారా ప్రధాని ప్రసంగించారు. గతేడాది ప్రజలిచ్చిన మద్దతు ఈ సారి కూడా అందించాలని, ఈ ప్రాచీన ప్రక్రియను ప్రోత్సహించాలని కోరారు. వసుధైక కుటుంబమన్న ఆదర్శాన్ని యోగాతో పునరుద్ఘాటించాలన్నారు. 2014, సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఆశించలేదని చెప్పారు. గతేడాది ఆ అద్భుత దృశ్యాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నానని పేర్కొన్నారు.
పసిఫిక్ ద్వీప దేశాల నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వరకూ, వ్లాడివోస్టోక్ నుంచి వాంకోవర్‌కు, కోపెన్‌హగెన్ నుంచి కేప్‌టౌన్ వరకూ వేలాది మంది తమ శరీరం, మనసుల్ని యోగాతో ఒకటి చేశారని గుర్తుచేసుకున్నారు. న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలోను యోగా ప్రతిధ్వనించిందని చెప్పారు. యోగా మన లోని కొత్త కోణాన్ని వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని, ఆరోగ్య పరిరక్షణతో పాటు సంతోషంగా ఉండేందుకు ఇది సంపూర్ణ విధానమని, శారీరక వ్యాయామాన్ని మించిన ప్రక్రియగా పేర్కొన్నారు. మనలో స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు, మనకు అవసరమైన స్పష్టత అందిస్తుందని చెప్పారు. యోగాలోని సంఘటిత శక్తితో పరిపూర్ణత సాధిస్తామని, ప్రపంచంతో ఏకీకృతం అవుతామని అన్నారు. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమయ్యేందుకు ఈ ప్రక్రియ తనలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు. అందరం కలసికట్టుగా ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పాటించేందుకు యోగా డే అవకాశం కల్గించిందన్నారు.
చండీగఢ్‌లో 150 మంది దివ్యాంగులతో..
ప్రధాని మోదీ హాజరయ్యే చండీగఢ్ యోగా వేడుకల్లో 150 మంది దివ్యాంగులు కూడా పాల్గొంటారు. ఇందుకోసం వారికి నెల రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరిలో 18 మంది మాజీ సైనికులున్నారు. ఇక జూన్ 21న ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ 3 వేల మంది బీఎస్‌ఎఫ్ జవాన్లతో కలసి జోధ్‌పూర్‌లో యోగా చేయనున్నారు.
కార్యక్రమాల్లో 57 మంది మంత్రులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 57 మంది కేంద్ర మంత్రులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌లో కార్యక్రమాలకు 10 మంది మంత్రులు హాజరవుతారు. అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నక్వీ, నిర్మలా సీతారామన్, మేనకా గాంధీతో మరికొందరు యూపీకి వెళ్లనున్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు (విజయవాడ), మనోహర్ పరీకర్(కాన్పూర్), వెంకయ్యనాయుడు(న్యూఢిల్లీ), పీయూష్ గోయల్(రాయ్‌పూర్), జేపీ నడ్డా (అహ్మదాబాద్) తదితరులు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
యోగాను ఆశ్రయిస్తోన్న కార్పొరేట్ కంపెనీలు, ఉద్యోగులు: అసోచాం
పనిచేసే చోట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఒత్తిడి తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలు యోగాను ఆశ్రయిస్తున్నాయని అసోచామ్ సర్వే వెల్లడించింది. యోగా చేయాలనుకునే కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య 35 నుంచి 40 శాతానికి పెరిగిందని అసోచాం హెల్త్ కమిటీ కౌన్సిల్ చైర్మన్ బీకే రావు చెప్పారు. 250 కంపెనీలకు చెందిన 1500 మందిపై ఈ సర్వే చేశారు. వీరిలో 45.5 శాతం డిప్రెషన్, ఆందోళనతో, 23 శాతం ఉద్యోగులు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నట్లు కనుగొన్నారు.
191 దేశాల్లో యోగా దినోత్సవం
జూన్ 21న 191 దేశాలు యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాయని, గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపైందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. లండన్‌లోని భారత హైకమిషన్, పర్యాటక విభాగాలు 14 యోగా శిక్షణ సంస్థలతో కలసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దక్షిణాఫ్రికా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో వేలాది మంది యోగా దినోత్సవంలో పాల్గొంటారు. జొహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా, డర్బన్, కేప్‌టౌన్‌లోని భారత రాయబార కార్యాలయాలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి. ఆస్ట్రేలియా, చైనా, పోలాండ్, అమెరికాతో పాటు అనే దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం సన్నాహక శిబిరాలు నిర్వహించారు.