
కాంగ్రెస్ స్పందన కావాలంటున్న వెంకయ్య
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నోట్ల కష్టాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ చర్చ జరగడం ప్రతిపక్షానికి ఇష్టం లేనట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. పాత పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో వివరణ ఇస్తారని తెలిపారు.
ఉడీ ఉగ్రవాద దాడి మృతులకన్నా నోట్ల రద్దు మృతులే ఎక్కువని గురువారం రాజ్యసభలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఆజాద్ వ్యాఖ్యలు ‘దేశ వ్యతిరేకం’అని బీజేపీ పేర్కొంది. ఆజాద్ క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసింది. తాను క్షమాపణ చెప్పబోనని ఆజాద్ స్పష్టం చేశారు.