'సీఎం అవుతానని ఊహించలేదు'
పాట్నా: నేను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రినవుతానని ఊహించలేదని బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జితన్ మంజీ అన్నారు. ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని జీతన్ అన్నారు.
తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేయడం, రాజీనామా ఉపసంహరణకు ఆయన ససేమిరా అనడంతో జేడీయూ కొత్త సీఎంను ప్రకటించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
దాంతో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జితన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా వ్యవహరించిన జితన్ రామ్ మంజీను నితీష్ ఎంపిక చేశారు. జితన్ ఎంపిక కూడా రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగింది.
నితీశ్‌కు 68 ఏళ్ల జితన్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడనే పేరుంది. జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుమ్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.