ముంబై: మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్న ఉప్పు స్వచ్ఛమైనది కాదా? ప్రముఖ కంపెనీలకు చెందిన ఉప్పు ప్యాకెట్లలో సైతం ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఐఐటీ బాంబేలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగం(సీఈఎస్‌ఈ) చేపట్టిన ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీఈఎస్‌ఈ చేపట్టిన పరిశోధనలో 8 కంపెనీలకు సంబంధించిన ఉప్పు ప్యాకెట్లను పరిశీలించగా వాటిలో 626 ప్లాస్టిక్ రేణువులు లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ రేణువుల సగటు పరిమాణం 5 మిల్లీమీటర్లుగా ఉంది. నదులు, కాలువల ద్వారా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో ఈ సూక్ష్మ రేణువులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొ. అమ్రితాన్షు శ్రీవాత్సవ్, చందన్‌కృష్ణ సేత్ తెలిపారు. ఈ కలుషిత నీటితో ఉప్పును తయారుచేయడంతో ప్లాస్టిక్ రేణువులు ఇంటింటికి చేరాయని వెల్లడించారు.
పరిశోధన సాగిందిలా..
ఇందులో భాగంగా పరిశోధకులు తొలుత ముంబైలోని సూపర్‌మార్కెట్లు, దుకాణాల్లో 8 కంపెనీలకు చెందిన 24 ఉప్పు ప్యాకెట్లను(ఒక్కో బ్రాండ్‌కు మూడు చొప్పున) కొనుగోలు చేశారు. ఇవన్నీ ఒకే నెలలో తయారైనవి కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఈ 8 సంస్థల్లో ఆరు గుజరాత్‌కు చెందినవి కాగా, కేరళకు చెందిన రెండు కంపెనీలు, మహారాష్ట్రకు సంబంధించి ఓ కంపెనీ ఉంది. వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా.. మొత్తం 626 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడ్డాయి. ఈ ప్లాస్టిక్‌లో 63 శాతం చిన్నచిన్న రేణువుల రూపంలో, మిగిలింది ప్లాస్టిక్ ఫైబర్ రూపంలో ఉన్నాయి. ఈ ఉప్పు ప్యాకెట్లలో లభ్యమైన ప్లాస్టిక్‌లో 80 శాతం రేణువులు 2 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ లెక్కన ప్రతిఏటా 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్‌ను భారతీయులు తమకు తెలియకుండా ఆహారంలో తీసుకుంటున్నట్లు నిర్ధారించారు.
ఈ ఫలితాలు హెచ్చరికే..
ఉప్పులో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల జాడ కన్పించడం అన్నది అన్నిదేశాలకు హెచ్చరికేనని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. సముద్రపు నీటిలో కాలక్రమేణా విచ్ఛిన్నమవుతున్న ప్లాస్టిక్ రేణువులు.. ఉప్పు, ఇతర సముద్ర ఉత్పత్తుల రూపంలో మనుషుల ఆహారపు గొలుసులోకి చేరుతున్నాయని వెల్లడించారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఉప్పును తయారుచేస్తున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధన చేపట్టినట్లు శ్రీవాత్సవ పేర్కొన్నారు. సముద్రాల్లోకి దేన్ని, ఎంత మొత్తంలో పారేస్తున్నామన్న విషయమై ఎలాంటి తనిఖీలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయిందని అభిప్రాయపడ్డారు. సాధారణ వడపోత పద్ధతుల ద్వారా ఈ నీటిలోని 85 శాతం ప్లాస్టిక్ రేణువులను తొలగించవచ్చని వెల్లడించారు.
భారత్‌కే పరిమితం కాదు..
ప్లాస్టిక్ భూతం అన్నది కేవలం భారత్‌కే పరిమితం కాలేదనీ, చైనా, స్పెయిన్, టర్కీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ సహా పలుదేశాల సముద్ర జలాలు దీనితో కలుషితమయ్యాయని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐదు ట్రిలియన్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్లు 2014లో ఓ సైన్స్ జర్నల్ కథనాన్ని ప్రచురించిందన్నారు. ‘సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులతో కలుషితమవుతున్న భారత సముద్రజలాలు– అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం’ పేరుతో తాము చేపట్టిన అధ్యయనంలో భారతీయులు ప్లాస్టిక్ ఉన్న ఉప్పును ఆహారంగా తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. ఈ పరిశోధన ‘ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్’ అనే ప్రఖ్యాత జర్నల్‌లో ప్రచురితమైందని శ్రీవాస్తవ వెల్లడించారు.
తినే ఉప్పులోనూ ప్లాస్టిక్ భూతం
Published Mon, Sep 3 2018 7:42 PM | Last Updated on Tue, Sep 4 2018 3:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment