IIT - Kharagpur Scientists Discovered Signs of Life In India From 2.5 Billion Years Ago - Sakshi
Sakshi News home page

250 కోట్ల ఏళ్ల క్రితమే భారత్‌లో జీవం! 

Published Tue, Jan 22 2019 3:07 AM | Last Updated on Tue, Jan 22 2019 1:02 PM

IIT Kharagpur scientists reveal about Bacteria - Sakshi

రాతిమట్టిని పరీక్షిస్తున్న శాస్త్రవేత్తలు

దేశంలో సుమారు 250 కోట్ల ఏళ్ల క్రితమే సూక్ష్మ జీవజాలం (బ్యాక్టీరియా) ఉన్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాను దక్కన్‌ పీఠభూమిలోని రాతిపొరల్లో భూమికి దాదాపు 3 కిలోమీటర్ల లోతులో వారు కనుగొన్నారు. ఇది గ్రేట్‌ ఆక్సిడేషన్‌ ఈవెంట్‌ కాలానికి చెందినది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలోని కొయినా ప్రాంతంలో ఐఐటీ బయోటెక్నాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. 1964 ప్రాంతంలో కరార్‌ అనే గ్రామం భూకంపం వచ్చి నాశనమైపోయింది. దీనికి కారణాలు ఏంటని భూగర్భశాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారు. అతిపురాతనమైన జీవం ఆనవాళ్ల కోసం అక్కడే వెతకడం మొదలుపెట్టారు. నీళ్లు, ఖనిజ లవణాలు ఏవీ లేని ప్రాంతంలో 3 బోరింగ్‌ యంత్రాలతో రంధ్రాలు చేసి రాతిమట్టిని వెలికితీశారు.

ఇలా తీసిన మట్టిలో 5 రకాల సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో కొన్ని బ్యాక్టీరియాలు హైడ్రోజన్, కార్బన్‌ డయాక్సైడ్‌లను ఇంధనంగా వాడుకుని బతికేశాయని.. ఇప్పుడు అవి జీవంతో ఉన్నాయా? లేదా? అన్నది చెప్పలేమని శాస్త్రవేత్త అవిశేక్‌ దత్తా తెలిపారు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోనూ జీవనం కొనసాగించడమెలా అన్న విషయంలో ఈ బ్యాక్టీరియా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ పరిశోధన వివరాలు ‘సైంటిఫిక్‌ రిపోర్ట్స్, నేచర్‌’లో ప్రచురితమవడంతో మొత్తం వ్యవహారం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిపై కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ అంశంపై విస్తృత పరిశోధనలు చేయాల్సిందిగా ఐఐటీ శాస్త్రవేత్తలను కోరింది. 

ఏంటీ ఆక్సిడేషన్‌ ఈవెంట్‌..: ‘భూమి పుట్టి 450 కోట్ల ఏళ్లు అవుతోందని అంచనా. విశాల విశ్వం నుంచి దూసుకొచ్చిన అనేక ఉల్కా శకలాలు అప్పట్లో భూమిని ఎడాపెడా ఢీకొడుతుండేవి. కొన్ని కోట్ల ఏళ్ల వరకూ ఈ పరిస్థితి ఇలానే కొనసాగింది. అప్పట్లో భూమ్మీద పెద్దగా జీవజాతులేవీ లేవు. భూమి లోపలి పొరలు అస్థిరంగా ఉండటంతో భూకంపాలు తరచూ వచ్చేవి. అగ్నిపర్వతాలు లావా ఎగజిమ్ముతుండేవి. అయితే 250 నుంచి 6.5 కోట్ల ఏళ్ల మధ్యకాలంలో భూమి లోపలి పొర అప్పుడప్పుడూ చల్లబడుతూ.. లావా చేరినప్పుడు మళ్లీ వేడెక్కేది. వేడి.. చల్లదనం మధ్యలోనే భూమ్మీద తొలి జీవం ఏర్పడిందని అంచనా. ఆ క్రమంలో భూమి వాతావరణంలోకి ఆక్సిజన్‌ వాయువు ప్రవేశించింది. ఆక్సిజన్‌ ప్రవేశించిన కాలాన్నే ‘గ్రేట్‌ ఆక్సిడేషన్‌ ఈవెంట్‌’అని అంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త పినాకీ సార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement