ఈ బ్యాక్టీరియా మంచిదే! | America Scientists identify a virus and two bacteria | Sakshi
Sakshi News home page

ఈ బ్యాక్టీరియా మంచిదే!

Published Sun, Jan 14 2018 3:02 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

America Scientists identify a virus and two bacteria - Sakshi

కన్ను, ముక్కు, నోరు, మెదడు, గుండె.. మన శరీరంలోని వేర్వేరు భాగాలివి. ఒక్కోటి ఒక్కో వ్యవస్థలో భాగాలు. అవేం చేస్తాయో మనకు తెలుసు. కానీ మనం పెద్దగా ఊహించని, మనకు అత్యవసరమైన మరో వ్యవస్థ కూడా మన శరీరంలో ఉంది. శరీరంలోనే ఉన్నా మనది కాని ఆ వ్యవస్థతో ఎంతో మేలు జరుగుతుంది. దానిలో తేడా వస్తే ఎన్నో అనారోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. మరి ఆ వ్యవస్థ ఏమిటో తెలుసా.. మన జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు.. అదే మైక్రోబయోమ్‌ వ్యవస్థ. మన శరీరం తగిన స్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవసరమైన ఈ సూక్ష్మ జీవ ప్రపంచం.. మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తింటే మేలు చేసే సూక్ష్మజీవుల శాతం పెరిగి.. మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదే సమయంలో పలు రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు విస్తృతమైన అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. మరి ఈ మైక్రోబయోమ్‌ వ్యవస్థ ఏంటి, దాని వల్ల లాభాలేంటి, మంచి ఆరోగ్యం కోసం మనం చేయాల్సిందేమిటనే అంశాలపై ఈ వారం ఫోకస్‌..  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

10,00,00,00,00,00,000
ఒకటి పక్కన పద్నాలుగు సున్నాలు.. అంటే కోటి కోట్లు.. మన శరీరంలోని సూక్ష్మజీవుల సంఖ్య ఇది. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా వంటివన్నమాట. మన శరీరంలో ఉండే మన శరీర కణాల కంటే.. ఇలా ఇతర జీవుల కణాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ సూక్ష్మజీవుల్లోనూ మనకు ఎక్కువగా తెలిసినవి, ఉపయోగకరమైనవి బ్యాక్టీరియా. ఇందులోనూ అత్యధికంగా ఉండేవి ఫెర్మీక్యూట్స్, బ్యాక్టీరియడైట్స్‌. ఒకటేమో గ్రామ్‌ పాజిటివ్‌. రెండోది నెగటివ్‌ అంటారు. ఇంకోలా చెప్పాలంటే బ్యాక్టీరియాను చూసేందుకు చేసే పరీక్షలో వంకాయ రంగులో కనిపించేవి గ్రామ్‌ పాజిటివ్, వేరే రంగులో కనిపించేవి నెగటివ్‌. ఇక మన శరీరంలో ఉండే సూక్ష్మజీవుల్లో దాదాపు 80% ఉండేది మన జీర్ణ వ్యవస్థలోనే! అంటే నోటి నుంచి జీర్ణాశయం, చిన్నపేగులు, పెద్దపేగు చివరి వరకు ఉండే వ్యవస్థలోనే.

ఎన్నో ఉపయోగాలు..
మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లను శరీరానికి వంటబట్టేలా చేయడం, కీలకమైన అమినోయాసిడ్లను తయారు చేయడం మన పేగుల్లోని సూక్ష్మజీవులు చేసే ముఖ్యమైన పనులు. చిన్నపేగులో జీర్ణం కాగా మిగిలిన ఆహారం నుంచి జీవక్రియలకు అవసరమైన రసాయనాలను కూడా సూక్ష్మజీవులే తయారు చేస్తాయి. పేగుల గోడలు బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని కాపాడేందుకూ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని అంచనా.

ఆహారం మారితే ఇబ్బందే..
ఒక రోజు పూర్తిగా మాంసాహారం తిని, తర్వాతి రోజు పూర్తిగా శాకాహారం తింటే.. పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యతలో తేడాలు వచ్చేస్తాయి. అంతా సర్దుకోవాలంటే రెండు రోజులు పడుతుందట. కొవ్వు పదార్థాలు బాగా లాగించినా, చక్కెరలు ఎక్కువగా తీసుకున్నా.. మన శరీర గడియారం గందరగోళానికి గురవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌లూ మనలోని బ్యాక్టీరియా వైవిధ్యతను మార్చేస్తాయి. తగిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచుకోవచ్చు. హాని కలిగించే వాటిని తగ్గించు కోవచ్చు. తినే తిండి, జీవనశైలి మనకొచ్చే రోగాలను నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలి.

మోతాదుల్లో తేడా వస్తే..
కీళ్ల నొప్పులు మొదలుకొని ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వరకు అనేక సమస్యలకు.. పేగుల్లోని సూక్ష్మజీవ వ్యవస్థలో జరిగే మార్పులకు మధ్య గట్టి సంబంధం ఉన్నట్లు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ (కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలతో కూడిన వ్యాధి)’ని ఉదాహరణగా తీసుకుంటే... ఈ సమస్యతో బాధపడేవారిలో ఫెర్మిక్యూట్స్, బ్యాక్టీరియోడైట్స్‌ తక్కువగా ఉంటాయి. ఈ రెండు రకాల బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే బ్యూటరైట్‌ రసాయనానికి వాపు/మంటలను తగ్గించే లక్షణముంది. ఊబకాయుల్లోనూ ఈ రెండు బ్యాక్టీరియాల నిష్పత్తిలో తేడా ఉంటుందని గుర్తించారు. ఇక మధుమేహంతో బాధపడుతున్నవారిలోనూ బ్యూటరైట్‌ శరీరానికి వంటబట్టకుండా పోతుందని, విటమిన్ల శోషణ సక్రమంగా ఉండదని తేలింది.

కొవ్వులతో ప్రభావం ఎక్కువే..
ఆహారంలోని కొవ్వుల విషయానికి వస్తే.. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్లు ఎక్కువైతే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని, గుండె జబ్బులకు దారితీస్తుందని తరచూ వింటూ ఉంటాం. ఈ రకమైన కొవ్వుల వల్ల పేగుల్లో ఆక్సిజన్‌ అవసరం లేని సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోవడం కూడా జబ్బులకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

వేర్వేరు మోతాదుల్లో కొవ్వులు తినే వారిపై పరిశోధనలు జరిపినప్పుడు.. సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకునే వారిలో ఒక రకమైన బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బ్యాక్టీరియా వైవిధ్యతలో పెద్దగా మార్పుల్లేవుగానీ.. చెడు కొలెస్ట్రాల్‌ మాత్రం తగ్గిందని తేల్చారు. సాల్మన్‌ వంటి చేపల్లో మోనో, పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్లే ఆ చేపలు తినేవారి కొలెస్ట్రాల్‌ మోతాదులు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ అధిక కొవ్వులతో కూడిన ఆహారంతో శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా పెరిగినట్లు వెల్లడైంది.

పోషకాలకు బ్యాక్టీరియాకు లింకేమిటి?
ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు... మనం తినే ఆహారంలోని ముఖ్యమైన పోషకాలివే. దేని ప్రత్యేకత, అవసరం దానిదే. అయితే కొన్ని రకాల పోషకాలు పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతాయి. 1977లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో బ్యాక్టీరియా వైవిధ్యత పెరుగుతుందని తెలిసింది. మాంసం ద్వారా అందే ప్రొటీన్లతో పోలిస్తే.. పాల నుంచి తయారుచేసే ‘వే ప్రొటీన్‌’, శనగల ప్రొటీన్లు కొన్ని రకాల హానికారక బ్యాక్టీరియాను తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. శాకాహార ప్రొటీన్లతో పేగుల్లో వాపు/మంటను తగ్గించే రసాయనాల ఉత్పత్తికి సాయపడుతుందని నిర్ధారించారు. అయితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

ఆ రకమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని రకాల బ్యాక్టీరియా తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వారిలో ఇన్సులిన్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుందని, అలాంటి వారికి మధుమేహం, కేన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక శాకరిన్, సుక్రోజ్‌ వంటి కృత్రిమ చక్కెరలు పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యతను తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి చేటు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పబ్‌మెడ్‌ ఆధారంగా అధ్యయనం..
ఇంటర్నెట్‌లో పబ్‌మెడ్‌ అని ఒక సెర్చింజన్‌ ఉంది. వైద్య సంబంధిత పరిశోధనలన్నింటి సమాచారాన్ని దాని ద్వారా సులువుగా సేకరించవచ్చు. పేగుల్లో సూక్ష్మజీవులకు, మన ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పబ్‌మెడ్‌లో విస్తృతంగా వెతికారు. ఆహారంలోని వేర్వేరు పదార్థాల పేర్లతోపాటు కొన్ని ఇతర కీలకమైన పదాలను ఉపయోగించారు. అలా లభించిన పరిశోధనా పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షించారు. 1970 నుంచి 2015 మధ్యకాలంలో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలను పరిశీలించారు.

 మొత్తంగా 188 పరిశోధనల సారాంశాన్ని వెలికితీసి.. ఒక పద్ధతి ప్రకారం అమర్చారు. ముఖ్యంగా జంతువులపై కాకుండా మనుషులపై జరిగిన పరిశోధనలను, ఇంగ్లిష్‌లో ఉన్న పరిశోధనా పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్తలు రస్నిక్‌ సింగ్, టినా భూటానీలు కూడా పాల్గొన్నారు.

మెడిటరేనియన్‌ డైట్‌తో మేలు
తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువగా వినియోగిస్తాం. ఉత్తరాదివారైతే గోధుమ ఉత్పత్తులు.. అమెరికా, యూరప్‌ దేశాల్లో మాంసం ఉత్పత్తులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరి ఈ వేర్వేరు ఆహారపు అలవాట్లు బ్యాక్టీరియా సంతతిపై ప్రభావం చూపుతాయా.. అంటే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. జంతువుల ద్వారా వచ్చే కొవ్వు పదార్థాలు ఎక్కువగా, పీచు పదార్థాలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహారపు అలవాట్లు పేగుల్లోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. అంతేగాకుండా కేన్సర్‌ కారక నైట్రోసమైన్స్‌ ఉత్పత్తిని పెంచుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

 గోధుమల్లో కనిపించే గ్లూటెన్‌ అనే పదార్థం లేని ఆహారం తీసుకున్నా మేలుచేసే బ్యాక్టీరియా తగ్గిపోయినట్లు మరో పరిశోధన చెబుతోంది. శాకాహారంపై చేసిన పరిశోధనలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియా తక్కువైనట్లు గుర్తించారు. ప్రపంచం మొత్తమ్మీద మంచి ఆహారంగా చెప్పే మెడిటరేనియన్‌ డైట్‌ మాత్రం మేలు చేసే బ్యాక్టీరియా సంతతిని పెంచుతున్నట్లు తెలిసింది. మెడిటరేనియన్‌ డైట్‌ అంటే.. మధ్యధరా సముద్ర ప్రాంతంలోని దేశాలవారీ ఆహార అలవాట్లుగా చెప్పొచ్చు.

 ఇందులో ప్రధానంగా శాకాహారం.. అందులో కూరగాయలు, పళ్లు, పొట్టు తీయని ధాన్యాలు, చిక్కుడు జాతికి చెందిన గింజలు, ఆలివ్‌ నూనె, అవిసె నూనెలను ఎక్కువగా ఉంటాయి. చేపలు, చికెన్‌ వంటి వాటిని కొంతవరకు, ఇతర మాంసాహారం వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఇక వీటన్నింటితోపాటు సరైన శారీరక శ్రమ, వ్యాయామం కూడా మెడిటరేనియన్‌ డైట్‌లో భాగమనే చెప్పవచ్చు.

మంచి బ్యాక్టీరియా పెంచుకోవాలంటే..

ఒకే రకమైన ఆహార అలవాట్లకు పరిమితం కాకుండా.. అందుబాటులో ఉండే అన్ని రకాల ఆహా రం తీసుకోవాలి. చిక్కుళ్లు, బీన్స్, పండ్లు ఎక్కువగా తింటే బైఫైడో బ్యాక్టీరియా పెరుగుతుంది. 

♦ పెరుగుతోపాటు ఊరబెట్టిన, పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల లాక్టోబాసిల్లీ బ్యాక్టీరియా పెరిగి మేలు జరుగుతుంది. దీనివల్ల హానికారక బ్యాక్టీరియా తగ్గుతుంది కూడా. 

♦ కృత్రిమ చక్కెరలు ఒక రకమైన బ్యాక్టీరియాను పెంచడం ద్వారా రక్తంలో చక్కెరల శాతాన్ని పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

♦ అరటిపండ్లు, ఓట్స్, యాపిల్స్‌ వంటివి ప్రీ బయాటిక్స్‌గా వ్యవహరిస్తాయి కాబట్టి పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. 

♦ నవజాత శిశువులకు తొలి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల వారి పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యత పెరుగుతుంది. 

♦ పాలిష్‌ చేయని ముడి ధాన్యం/గింజలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం, బీటా గ్లూకన్‌ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. ఫలితంగా మధుమేహం, కేన్సర్‌ వ్యాధికారక రసాయనాల ఉత్పత్తిని అడ్డుకోవచ్చు. 

♦ శాకాహారం వల్ల ఈ–కోలీ వంటి బ్యాక్టీరియా తగ్గుతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్‌ మోతాదులు నియంత్రణలోకి వస్తాయి. అదే సమయంలో వేర్వేరు వ్యాధులకు కారణమైన వాపు/మంటలను పరిహరించవచ్చు. 

♦ మరీ అత్యవసరమైతేనే యాంటీ బయాటిక్‌ మందులను వాడాలి. ఈ మందులు పేగుల్లో అన్ని రకాల బ్యాక్టీరియా రకాలను నాశనం చేస్తాయి. 

♦ గ్రీన్‌టీ, రెడ్‌వైన్, డార్క్‌ చాకోలెట్, ఆలివ్‌ ఆయిల్‌ వంటి ఆహారంలో ఉండే పాలీఫినాల్స్‌ను పేగుల్లోని సూక్ష్మజీవులు నమిలేస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు సాయపడతాయి.

ప్రీ బయాటిక్స్‌తో ఎంతో మేలు..
ప్రీ బయాటిక్స్‌లో అత్యధిక శాతం సరిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్లే. అంటే పీచు, పిండి పదార్థాలు అని చెప్పవచ్చు. వీటిలోనూ జీర్ణమయ్యేవి, కానివని రెండు రకాలు. మొదటి రకం వాటికి బియ్యం మంచి ఉదాహరణ. చిన్న పేగుల్లో కొన్ని ఎంజైమ్‌లతో కలసినప్పుడు ఈ కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోస్‌ వంటి చక్కెరలుగా మారిపోతాయి. ఇవి రక్తంలోకి చేరడంతో శరీరం స్పందించి ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. సహజ చ క్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే బైఫైడో బ్యాక్టీరియా ఎక్కువ కాగా.. బ్యాక్టీరియోడైస్‌ తక్కువయ్యాయి. ఇక సరిగా జీర్ణం కాని పీచు, పిండి పదార్థాలు నేరుగా పెద్దపేగుల్లోకి చేరతాయి. 

అక్కడి సూక్ష్మజీవులు ఈ పదార్థాలను పులిసిపోయేలా చేస్తాయి. పీచు ఎక్కువగా తింటే పేగుల్లోని బ్యాక్టీరియా అంతే చురుకుగా పనిచేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ప్రీ బయాటిక్స్‌ పదార్థాలు వాపు/మంటకు కారణమయ్యే సైటోకైన్‌ ఐఎల్‌–6 ను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్‌ నిరోధకతను పెంచుతా యని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రీ బయాటిక్‌ పదార్థాల వల్ల పేగుల్లో ‘షార్ట్‌ చెయిన్డ్‌ ఫ్యాటీ యాసిడ్ల’ ఉత్పత్తి ఎక్కువై రోగ నిరోధక వ్యవస్థకు, జీర్ణక్రియకు సాయపడుతుందని పలు కొన్ని పరిశోధనల్లో తేలింది.

‘మీరు తీసుకునే ఆహారంలో పావు వంతు మిమ్మల్ని బతికిస్తుంది. మిగిలిన మూడొంతులు వైద్యులు బతికేలా చేస్తుంది!’ 
– డాక్టర్‌ ఆండ్రూ సాల్‌! 

‘తినే తిండి బాగోలేకపోతే ఏ మందూ పనిచేయదు... సరైన తిండే ఉంటే మందుల అవసరమే ఉండదు!’     
– ఆయుర్వేదం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement