సాక్షి, బెంగళూరు : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో వస్తే గనుక దేశం నాశనమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.
సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించడం, రాజకీయ పార్టీలు పెట్టడాన్ని సమర్థించనంటూ బెంగళూరులో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నటుడికి కుల, మతాలకు, వర్గాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. రాజకీయాలు అనేవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని వర్గాల అభిమానులను దూరం చేస్తాయి. అభిమానుల పట్ల నటులు బాధ్యతతో ప్రవర్తించాలంటే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది’’ అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఇక నటులు రాజకీయాల్లోకి రావటాన్ని ప్రకృతి విపత్తుతో పోల్చిన ఆయన.. థియేటర్లలో జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి పౌరులు దేశభక్తిని నిరూపించుకోవాలా.. అని అభిప్రాయపడ్డారు.
గతంలో పెద్ద నోట్ల రద్దు, హిందూ అతివాదం, ప్రధాని మోదీ తనకంటే మంచి నటుడు అంటూ వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్.. తర్వాత కమల్ కు మద్దతు ఇవ్వటం, పలు రాజకీయ అంశాలపై స్పందించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ కూడా రాజకీయాల్లోకి రావటం ఖాయమని అంత అనుకున్నారు. ఆ అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ తాను రాజకీయాలకు దూరమని ప్రకాశ్ రాజ్ ఓ స్పష్టత ఇచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment