
ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మోదీకి లేఖ రాసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
న్యూఢిల్లీ : ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తేదీ ఖరారు చేయండంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీని కోరారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మోదీ ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. అందుకు బదులుగా ఇమ్రాన్ మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. త్వరలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్, మోదీని కోరారు. అంతేకాక రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించాలన్నారు. త్వరలోనే సార్క్ సదస్సును పాకిస్తాన్‌లో నిర్వహించేలా చూడలాని.. ఇందుకు భారత దేశం తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్, అభ్యర్ధించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో 20వ సార్క్ సదస్సు శ్రీలంకలో జరగనుంది. 2016లో సార్క్ సదస్సు పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. జమ్ముకశ్మీర్ యురి సెక్టార్ లోని ఆర్మీ స్థావరంపై టెర్రిరిస్ట్ ల దాడి భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలు సార్క్ సదస్సుకు హాజరుకాలేమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్‌లో సార్క్ సదస్సు పాక్‌లో నిర్వహించడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్ కోరారు.
ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి (యుఎన్‌జిఎ) సమావేశాలకు హాజరయ్యేందుకు గాను న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సుష్మ స్వరాజ్ సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల అనధికార సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం గురించి చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. అన్ని అనుకూలిస్తే ఈ సమావేశం సార్క్ సదస్సుకు ఒక రోజు ముందు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment