దేశంలో నాలుగు ప్రధాన నగరాలు.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై. ఈ నాలుగు చోట్లా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలే ఉన్నారు. మార్చి 31వ తేదీన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇందిరా బెనర్జీ నియమితులయ్యారు. దాంతో ఈ లాంఛనం పూర్తయినట్లయింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలా నాలుగు ప్రధాన నగరాల్లోను మహిళా ప్రధాన న్యాయమూర్తులే ఉండటం ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ నాలుగు హైకోర్టులు కూడా స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్నవే. మద్రాసు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సహా మొత్తం ఆరుగురు మహిళా జడ్జిలున్నారు. మరో 53 మంది పురుష జడ్జీలు కూడా ఉన్నారు.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారైన జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ 13 నుంచి ఉన్నారు. ఇక్కడ 9 మంది మహిళా జడ్జీలుండగా 35 మంది మగ న్యాయమూర్తులు ఉన్నారు.
బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మంజులా చెల్లూర్ ఉన్నారు. ఆమె గత సంవత్సరం ఆగస్టు 22న బాంబే హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే అత్యధికంగా 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉండగా 61 మంది పురుష న్యాయమూర్తులు ఉన్నారు.
కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషితా నిర్మల్ మాత్రే. ఇక్కడ మొత్తం నలుగురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉండగా 35 మంది పురుష న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మొత్తం 24 హైకోర్టులలో 632 మంది జడ్జీలు ఉండగా వారిలో 68 మంది మాత్రమే మహిళలు. అంటే 10.7% మాత్రమే. ఇక సుప్రీంకోర్టులో అయితే మొత్తం 28 మంది జడ్జీలుండగా కేవలం ఆర్.భానుమతి అనే ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ఉండటం గమనార్హం.
నాలుగు మెట్రోల్లో మహిళలే ప్రధాన న్యాయమూర్తులు
Published Sat, Apr 8 2017 12:05 PM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM
Advertisement