రాజ్యసభకు రూపా గంగూలీ
న్యూఢిల్లీ: ప్రముఖ బుల్లితెర నటి, పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రూపా గంగూలీ(49) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఈమేరకు రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1988లో ప్రసారమైన మహాభారతం సీరియల్‌లో ద్రౌపదిగా నటించి రూపా ప్రేక్షకాదరణ పొందారు.
ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడారు. తనను రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసినందుకు బీజేపీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రూపా గంగూలీ 2015లో బీజేపీలో చేరారు.