సంఖ్య పెరిగినా ఎన్డీఏకి మెజారిటీ లేదు
- రాజ్యసభలో కీలకంగా ప్రాంతీయ పార్టీలు
- ఎన్డీఏకు పెరిగింది 5 సీట్లు.. యూపీఏకు తగ్గింది 3
న్యూఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. ప్రతిపక్ష యూపీఏ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్నా.. కీలకమైన బిల్లులపై ఆమోదముద్ర పడేందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఈసారి 57 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 24 సీట్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ 11, ఇతర ప్రాంతీయ పార్టీలు 22 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి ఎన్నికల తర్వాత రాజ్యసభలో సీట్ల సంఖ్యలో యూపీఏ కేవలం 3 సీట్లే కోల్పోయింది. తాజా ఎన్నికలతో ఎగువసభలో ఎన్డీఏకు 74 (+5), యూపీఏకు 71(-3) సీట్లుండగా.. ప్రాంతీయ పార్టీల సంఖ్య గతంలోలాగే 89 గానే ఉంది. దీంతో జీఎస్‌టీతోపాటు కీలకమైన బిల్లుల విషయంలో అధికార ఎన్డీఏకు ప్రాంతీయ పార్టీల మద్దతు చాలా అవసరం.
ఓట్లు చెల్లకపోవటం బీజేపీ కుట్రే
హరియాణా ప్రభుత్వం కుట్రవల్లే రాజ్యసభ ఎన్నికల్లో 14 మంది తమ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాలేదని కాంగ్రెస్ నేత, హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించిన హూడా.. దీనిపై సోమవారం ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ.. అధికార కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసిన తమ 8 మంది ఎమ్మెల్యేలను జేడీఎస్ సస్పెండ్ చేసింది.. వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని నాయకత్వం.. స్పీకర్ తిమ్మప్పను కోరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ నుంచి శాసనమండలి, రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థులైన వెంకటపతి, ఫారూక్‌లు ఓడిపోవడం తెలిసిందే. ఇందుకు జమీర్ అహ్మద్‌ఖాన్ నేతృత్వంలోని ఎనిమిది మంది శాసనసభ్యులు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడటమే కారణమని జేడీఎస్ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరిగిన జేడీఎస్ కార్యకర్తలు, పదాదికారుల సమావేశంలో వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.