
జర్నలిస్టులకు ఇండియా డేంజర్!
పత్రికా రంగంలో పనిచేసే విలేకరులకు భారతదేశం సురక్షిత ప్రాంతం కాదని ఓ సర్వే తేల్చింది. అయితే, ప్రపంచంలోనే ఎక్కువ స్వేచ్ఛ ఉండే వాతావరణం భారతదేశ సొంతమని, ఇక్కడ జర్నలిజం చాలా శక్తిమంతమైనదని తెలిపింది.
న్యూఢిల్లీ: పత్రికా రంగంలో పనిచేసే విలేకరులకు భారతదేశం సురక్షిత ప్రాంతం కాదని ఓ సర్వే తేల్చింది. అయితే, ప్రపంచంలోనే ఎక్కువ స్వేచ్ఛ ఉండే వాతావరణం భారతదేశ సొంతమని, ఇక్కడ జర్నలిజం చాలా శక్తిమంతమైనదని తెలిపింది. కానీ, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోవడం కొంత ఆందోళనకరమని వాపోయింది. గత 22 ఏళ్లలో ఇప్పటివరకు 58 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారని సర్వే పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో కూడా నరమేధం జరుగుతుందనే విషయాన్ని ఈ ఘటనలు రుజువు చేశాయని వెల్లడించింది.
భారత్లో విలేకరులు ఎన్నో అరాచకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులంతా చిన్న చిన్న ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో అతి తక్కువ నికర వేతనాలకే పనిచేస్తున్నారని తెలిపింది. వీటికి స్థిరమైన సంస్థలు లేవని, శక్తిమంతమైన నెట్ వర్క్ కూడా లేదని తెలిపింది. సోషల్ మీడియా వల్ల మీడియా వ్యక్తులకు కొంత ఓదార్పు లభించిందని పేర్కొంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా ఇప్పుడిప్పుడే కొంత స్వేచ్ఛాయుత జర్నలిజంలోకి వస్తున్నారని, ఆశించినంత స్థాయిలో జర్నలిజం విలువలు లేవని కూడా ఆ సర్వే తెలిపింది. 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్' అనే పేరిట ఓ వెబ్సైట్ ఈ సర్వే నిర్వహించి వివరాలు వెల్లడించింది.