మూడు గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసికి..
న్యూఢిల్లీ: మరో బుల్లెట్ రైలు దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ఢిల్లీ నుంచి వయా అలిఘర్,ఆగ్రా, లక్నో,సుల్తాన్ పూర్ మీదగా ఈ రైలు వారణాసికి చేరుకుంటుంది. కాగా ప్రస్తుతం ఢిల్లీ-వారణాసి మధ్య 10 నుంచి 14 గంటల పాటు ప్రయాణ సమయం పడుతోంది. అయితే తాజాగా బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ సమయం అనూహ్యంగా తగ్గిపోనుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 782 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2గంటల 40 నిమిషాల్లోనే ఈ రైలు చేరుకోనుంది.
ఇక ఢిల్లీ నుంచి లక్నోకు కేవలం గంటా 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అధ్యయనం చేసిన స్పానిష్ సంస్థ నివేదిక కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఈఏడాది చివరికల్లా నివేదిక తుది రూపు దిద్దుకోనుంది. దీనికోసం సుమారు రూ.43,000 కోట్ల వ్యయం కానున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ముంబయి-అహ్మదాబాద్ కారిడార్ మధ్య నడిచే బుల్లెట్ ట్రయిన్ ఇటీవలే ట్రయిల్ రన్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రైలు 2023కి ప్రజలకు అందుబాటులోకి రానుంది.