ట్రంప్ భజన చేసేందుకే: చైనా
న్యూఢిల్లీ: తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న తమను అడ్డుకునేందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న చైనా-భారత్ సరిహద్దులో భారత ఆర్మీ బలగాలు అలజడి సృష్టించాయని చైనా ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
సరిగ్గా అమెరికా పర్యటనకు ముందు బోర్డర్‌లో అలజడికి కారణం.. మోదీ ట్రంప్ భజనకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరరేషన్ ఆర్మీ బలగాలు భారత పోస్టులోకి దూసుకొచ్చి బంకర్లను ధ్వంసం చేశాయని భారత బలగాలు పేర్కొన్నాయి. తాము రోడ్డు వేయడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు భారత దళాలు వచ్చాయని చైనా పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే, చైనా చెప్పిదంతా అబద్దమని భారత్, భూటాన్‌లు పేర్కొన్నాయి. డొక్లామ్‌లో రోడ్డు నిర్మించడాన్ని విరమించుకోవాలని భూటాన్ ఆర్మీ చైనాకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసింది. అయినా కూడా తమ దేశం చేసిన తప్పును సమర్ధించుకునేందుకు గ్లోబల్ టైమ్స్ ప్రయత్నించింది. మోదీ-ట్రంప్‌ల మధ్య జరిగిన భేటీ కారణంగా భారత్‌కు ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించింది.
'డీ-గ్లోబలైజేషన్, అమెరికన్స్ ఫస్ట్ అనే పాలసీకి ట్రంప్ కట్టుబడి ఉంటారు. మోదీ ప్రపంచీకరణకు, మేక్ ఇన్ ఇండియా పాలసీకి కట్టుబడి ఉంటారు. వీరిద్దరి మధ్య సయోధ్య అసలు కుదరదు' అని తన ఎడిటోరియల్ కాలమ్‌లో పేర్కొంది. అందుకే హెచ్-1బీ వీసా పాలసీ, భారత్‌లో అమెరికా పెట్టుబడులు సరిగ్గా లేవని వ్యాఖ్యానించింది.