సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మొన్నటి వరకు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపిన ప్రాణాంతక కరోనా.. భారత్‌లోనూ అదే వరవడిని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 81,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2649 మంది మృత్యువాత పడ్డారు. ఇదే క్రమంలో కరోనా వైరస్ పురుడుపోసుకున్న చైనాను భారత్ అధిగమించబోతోంది. చైనాలో ఇప్పటి వరకు 82,933 కరోనా కేసులు నమోదు కాగా.. 4633 మంది మరణించారు. అయితే చైనాతో పోల్చుకుంటే భారత్‌లో కాస్తా మరణాల రేటు తక్కువగా ఉంది. భారత్‌లో గడిచిన నెలరోజుల్లో ప్రతి రోజూ కనీసం మూడువేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటికి భారత్ చైనాను అధిగమించనుంది. (దేశంలో మరో 3,967 పాజిటివ్ కేసులు)
అయితే కరోనా కేసులను బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం దాస్తోందంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక వైరస్‌కు జన్మస్థలమైన వుహాన్ నగరంలోనూ పెద్ద ఎత్తున మరణాలు నమోదు అయినప్పటికీ చైనా ప్రభుత్వం వాటిని బయటకు రానీయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే చైనాలో కరోనా కేసులు లక్షకు పైనే నమోదై ఉంటాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటనీ డ్రాగాన్ దేశం ఖండించింది. మరోవైపు వైరస్ బారిపడ్డ మొత్తం 80వేలకు పైగా బాధితులు పూర్తిగా కోలుకున్నారని చైనా చెబుతోంది. అయితే చైనీయులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడంతో కొంతమేర వైరస్‌ను కట్టడి చేశారనే చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో పాటు రోజు వారి కార్యాకలాపాలను సైతం ఆ దేశం ప్రారంభించిన విషయం తెలిసిందే.(విదేశాల నుంచి రాకతో పెరిగిన కరోనా)
Comments
Please login to add a commentAdd a comment