
'ఐఎం అనేది ఉగ్రవాద సంస్థ కాదు'
పనాజీ: ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) అనేది ఉగ్రవాద సంస్థ కాదని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ చైర్మన్ ఖుర్షిద్ అహ్మద్ సయ్యద్ వ్యాఖ్యానించారు. భారత్ , అమెరికాల్లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎంకు మత పరమైన అభిమానం మాత్రమే ఉందని.. కానీ ఆ సంస్థ ఎప్పుడూ ఉగ్రవాద చర్యలకు పాల్పడలేదని ఖుర్షిద్ అహ్మద్ తెలిపారు.
గోవా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం విలేకర్లతో మాట్లాడిన ఖుర్షిద్.. మిగతా దేశాల్లో ముస్లిం టెర్రిరిస్టులు ఉండవచ్చు కానీ భారత్ కు చెందిన ముస్లింలు ఎప్పుడూ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనలేదని తెలిపారు. ఈ విషయంలో తాను మాత్రం చాలా కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నానన్నారు. అయితే గతంలో ఐఎం పేరుతో జరిగిన ఉగ్రవాద చర్యలపై విలేకర్లు ప్రశ్నించగా.. దేశంలో గందరగోళ పరిస్థితులు స్పష్టించటానికి వేరే సంస్థలు ఆ చర్యలకు పాల్పడి ఉండవచ్చని ఖుర్షిద్ పేర్కొన్నారు.