న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీకి పూర్వ విద్యార్థులు భారీ సాయం అందించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పారిశ్రామికవేత్త ప్రశాంత్ పాలకుర్తి, ఆయన భార్య అనురాధ బిట్స్ పిలానీకి రూ.7.17 కోట్ల(మిలియన్ డాలర్ల) భారీ విరాళాన్ని ప్రకటించారు. రాజస్తాన్ క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం( 1978–83 బ్యాచ్) సందర్భంగా ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ప్రస్తుతం అమెరికా కేంద్రంగా రెఫ్లెక్సిస్ అనే కంపెనీని నడుపుతుండగా, అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు.
ఈ విషయమై బిట్స్ పిలానీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.సౌవిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘పాలకుర్తి ప్రశాంత్, అనురాధ దంపతులు అందజేసిన భారీ విరాళాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బిట్స్ పిలానీని ప్రపంచస్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.100 కోట్లతో పరిశోధన నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నాం. అంతర్జాతీయంగా పరిశోధన అంశాలపై దృష్టి సారించే ఫ్యాకల్టీతో పాటు పోస్ట్ డాక్టోరల్ ఫెలోస్, రీసెర్చ్ స్కాలర్లను ఆకర్షించేలా బిట్స్ పిలానీని తీర్చిదిద్దుతాం. ఈ గొప్ప ప్రయత్నానికి తమవంతు సహకారం అందించాలని సంస్థ పూర్వ విద్యార్థులను కోరుతున్నాం’ అని తెలిపారు. 200 మంది పూర్వ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రశాంత్ పాలకుర్తి మాట్లాడుతూ..‘ 40 సంవత్సరాల క్రితం మా ప్రయాణం ఇక్కడే (బిట్స్ పిలానీ) మొదలైంది. జీవితంలో ఎదిగేందుకు మాకు ఎంతో సాయం చేసిన ఈ సంస్థకు ఎంతోకొంత తిరిగివ్వాలని భావించాం’ అని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ‘డెజర్ట్ స్ట్రోమ్’ పేరుతో అనురాధ సంగీత విభావరి నిర్వహించారు.
హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య...
హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ప్రశాంత్ పాలకుర్తి తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. అనంతరం బిట్స్ పిలానీ నుంచి గణితం, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తన జూనియర్ అయిన అనురాధను పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత అమెరికాకు వెళ్లి 2001లో రిఫ్లెక్సిస్ సిస్టమ్స్ అనే సంస్థను స్థాపించారు. స్టోర్ల నిర్వహణ, వినియోగదారుల్ని ఆకర్షించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి రిటైల్ మేనేజ్‌మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. నేపథ్య గాయని అయిన అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే కంపెనీని ఏర్పాటుచేసి సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. మసాచుసెట్స్ రాష్ట్రం వెస్టన్‌లో ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
బిట్స్ పిలానీకి 7.17 కోట్ల విరాళం
Published Sun, Nov 18 2018 4:51 AM | Last Updated on Sun, Nov 18 2018 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment