ఇందిరకే అత్యంత ప్రజాదరణ
శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య భారతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీయేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. తిరుగులేని నిర్ణాయాత్మక నేతగా పేరు సంపాదించుకున్న ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వానికి సందేశాన్నిచ్చారు. సంస్థాగత విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇందిర శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘ఇండియాస్ ఇందిర – ఎ సెంటెన్నియల్ ట్రిబ్యూట్’ పుస్తకాన్ని ప్రణబ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో రెండోసారి కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత నెలకొన్న దుర్భర పరిస్థితుల్లోనూ ఇందిర కేవలం రెండునెలల్లోనే ఎన్నికలు ఎదుర్కొని కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చారన్నారు. ఇందుకు ఆమె వేగంగా, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమే కారణమన్నారు. ‘20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకుల్లో ఆమె ఒకరు. ఆమె మరణించి ఇన్నేళ్లయినా నేటికీ ప్రజాస్వామిక భారతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఆమెనే’ అని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఉప రాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొన్నారు.