లాక్‌డౌన్ ప్రభావం ఇంకా చాలాకాలం ఉంటుందని, పొదుపు పాటిస్తామని చెప్పినవారు : 82%
ఆన్‌లైన్ కొనుగోళ్లకు మొగ్గు చూపినవారు : 44%
స్థానిక కిరాణా దుకాణాలపైనే ఆధారపడేవారు: 70%
రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లం అని చెప్పిన వారు : 63%
బయటి ఆహారం తగ్గిస్తామని చెప్పిన వారు: 43%
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితులు.. ఆర్థిక వనరులు, ఉద్యోగాలు, జీతాలు, ఆదా యాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల వ్యవహారశైలిలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నా యి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరి స్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆర్థిక పరిస్థితి మెరుగునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, మరో 2–3 నెలలు లేదా అంతకుమించి దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న వారి సంఖ్య 80%కి పైగా ఉంది. గృహావసరాలు, ఔషధాలు, ఆహార పదార్థాలు మినహా మిగతా ఖర్చులు తగ్గించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువగా సమీప కిరాణా దుకాణాలపై ఆధారపడటం లేక ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, కనిష్టంగా మరో 3 నుంచి 4 నెలలు ఈ ప్రభావం ఉంటుందని జాతీయ సంస్థలు చేసిన సర్వేలు చెబుతున్నాయి.
పొదుపు మంత్రం..
దిగువ, మధ్యతరగతి సహా ఎగువ తరగతిపైనా లాక్‌డౌన్ పెను ప్రభావాన్ని చూపింది. ఈ ప్రభావం మరో 2–3 నెలలు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు 35% మంది, మరో 4–6 నెలలు ఉంటుందని 32% మంది, అంతకుమించి ఉంటుందని 15% మంది భావిస్తున్నారని ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తంగా 82% మంది తమ ఆర్థిక వనరులను జాగ్రత్తగా వాడుకుంటామని, పొదుపు చర్యలు పాటిస్తామని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటామని సర్వేలో వెల్లడించారు. అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక ఇంటి ఆదాయం ఏప్రిల్‌లో 54శాతం తగ్గగా, అది మే నెలలో 65శాతం తగ్గిందని, మరో రెండు నెలల పాటు ఆదాయంపై లాక్‌డౌన్ ప్రభావం మరో 54శాతం ఉంటుందని చాలా కుటుంబాలు సర్వేల్లో తమ అభిమతాన్ని వెల్లడించాయి. ఇదే సమయంలో గృహావసర వస్తువులపై చేసే ఖర్చు ఏప్రిల్, మే నెలల్లో 49శాతం పెరగగా, మరో రెండు నెలలు 40శాతం వరకు పెరిగే అవకాశాలే ఎక్కువని వినియోగదారులు భావిస్తున్నారు.
కిరాణాలే దగ్గరి దారి..
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడంలో కిరాణా దుకాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. లాక్‌డౌన్ పరిస్థితులు, పోలీసు ఆంక్షలు, ప్రభుత్వ జాగ్రత్తల నేపథ్యంలో వినియోగదారులు సూపర్‌మార్కెట్లు, స్టోర్‌లు, మాల్స్‌కు వెళ్లడం పూర్తిగా తగ్గించారు. సూపర్ మార్కెట్లకు సరుకులు తెచ్చే వాహనాల రవాణాలో ఇబ్బందులు, గోదాముల్లో సరుకుల ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత నేపథ్యంలో పూర్తిస్థాయి సరుకుల లభ్యత తగ్గడంతో వినియోగదారులంతా కిరాణా దుకాణాల్లో కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఇంటికి దగ్గరలోనే కొనుగోలు, నాణ్యత, ప్రయాణ సౌలభ్యాల నేపథ్యంలో వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు సైతం అందుబాటులో ఉండటం వినియోగదారుల చెల్లింపులను సులభతరం చేస్తోంది. ఇక కూరగాయలు, పండ్లు విక్రయాలకు సైతం స్థానికంగా అందుబాటులోకి వచ్చిన మొబైల్ కూరగాయల దుకాణాలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. రైతుబజార్లకు, ఇతర పెద్ద మార్కెట్లకు వినియోగదారులు పెద్దగా వెళ్లడం లేదు. మరో రెండు, మూడు నెలల పాటు తమ ప్రయాణాలు, ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా స్థానిక కిరాణాలపైనే ఆధారపడే వారి సంఖ్య 70శాతం వరకు ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపే వారి సంఖ్య 44శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి.
సినిమాలు, షికార్లకు ‘నో’..
లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసినా ఖర్చులపై నియంత్రణ మరో మూడు, నాలుగు నెలల పాటు ఉండనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లడం తగ్గిస్తామని 63శాతం మంది, పర్యటనలు ఆపుతామని 59శాతం, కార్లలో ప్రయాణం చేయబోమని 56శాతం, వాహనాలు కొనబోమని 41శాతం, సినిమాలకు వెళ్లబోమని 49శాతం, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు చేయబోమని 52శాతం, బయటి ఆహారం తగ్గిస్తామని 43శాతం, బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటామని 51శాతం మంది వినియోగదారులు ఇటీవల ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడించారు. ఇక ఆహారశైలినీ మార్చుకుంటున్న వినియోగదారులు కూల్‌డ్రింక్స్ స్థానంలో పాలు, పెరుగు వినియోగాన్ని పెంచారు. స్వీట్స్ వంటి వస్తువుల ఉత్పత్తికి వినియోగించే పాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మళ్లాయని, ప్యాకేజ్డ్ పాల వినియోగం లాక్‌డౌన్ తర్వాత 15 నుంచి 25 శాతం పెరిగిందని ఈ సర్వేలు తెలిపాయి. డ్రింక్స్‌కు బదులు ప్రతి ఇంట్లో వేసవితాపానికి విరుగుడుగా చల్లని మజ్జిగ ఎక్కువ వినియోగిస్తున్నారని, నిమ్మకాయ తదితర రసాలు తాగేందుకు అధికశాతం మంది ఆసక్తి చూపుతున్నారని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో చేసిన అభిప్రాయ సేకరణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment