ఐఎన్ఎస్ కోల్కతా జాతికి అంకితం
ముంబయి : భారత నేవీ అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక చేరింది. ఐఎన్ఎస్ కోల్కతాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం జాతికి అంకితం చేశారు. ముంబయిలోని నౌకాస్థావరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నౌకను నేవీకి అప్పగించారు. దేశంలోనే ఇది అతి పెద్ద నౌక. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధనౌక బరువు 7,500 టన్నులు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ భారతదేశాన్ని కాచి కాపాడాతున్నది సైనిక దళాలే అన్నారు. యుద్ధానికి సిద్ధమే కానీ, కయ్యానికి కాలు దువ్వమని ఆయన తెలిపారు. ఇకపై నేవీ సైనిక బలం మరింత పెరిగిందన్నారు.
ఐఎన్ఎస్ కోల్కతా తయారీతో మన దేశ పరిజ్ఞానాన్ని చాటి చెప్పామని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నౌకను తయారు చేసిన శాస్త్రవేత్తలను అభినందించకుండా ఉండలేక పోతున్నానని ఆయన అన్నారు. భారత దేశ రక్షణలోత్రివిధ దళాలు ముఖ్యమైనవని, దేశాన్ని కాపాడుతున్నది సైనిక బలగాలేనని తెలిపారు. సైనికులు దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని, అనుక్షణం సరిహద్దులో కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు.
వారి సేవలు భారత ప్రజలు మరవలేనివని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో చత్రపతి శివాజి కూడా సముద్ర రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎన్ఎస్ కోల్కతా చేరికతో ఏ దేశం మనతో సవాల్ చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు పాల్గొన్నారు.