ప్రత్యర్థులు భయపడేలా సైనిక సంపత్తి
రక్షణ దళాలను ఆధునీకరిస్తాం: ప్రధాని మోడీ
స్వదేశీ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ జాతికి అంకితం
ముంబై: మన దేశంపై ప్రత్యర్థులెవరూ కన్నెత్తి చూసే ధైర్యం చేయలేని స్థాయిలో సైనిక దళాలను ఆధునీకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో గెలుపొందడం ఇప్పుడు అంత కష్టం కాదు. అత్యాధునిక ఆయుధ పాటవం ఉన్న సైనిక వ్యవస్థ ఉంటే చాలు.. యుద్ధంలో గెలుపు నిశ్చయమైనట్లే. మన దగ్గర శక్తి సామర్ధ్యాలు ఉంటే.. ఎవరూ మనల్ని సవాలు చేసే ధైర్యం చేయలేరు. శక్తిమంతమైన సైనిక వ్యవస్థనే అతిపెద్ద యుద్ధ నిరోధకం’ అన్నారు. ఆయుధ, సైనిక సామర్ధ్యం విషయంలో విదేశాల్తో పోల్చుకుని మనం వెనకబడి ఉన్నామని ఏ సైనికుడు భావించకూడని స్థాయిలో.. రక్షణ దళాలను ఆధునీకరిస్తామని తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అతిపెద్ద, అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ను శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ..
ఈ సందర్భంగా నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ మేథోపరమైన సామర్ధ్యానికి ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ను ప్రతీకగా మోడీ అభివర్ణించారు. అంతర్జాతీయ వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తీర ప్రాంత రక్షణకు ప్రాధాన్యత పెరిగిందని, పొడవైన తీర రేఖ కలిగిన భారత్.. అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశ నౌకా వాణిజ్య ప్రయోజనాలకు ఐఎన్‌ఎస్ కోల్‌కతా కాపాడగలదని, విదేశీ నౌకా వాణిజ్య వేత్తల్లో భద్రతపై విశ్వాసం పాదుకొల్పగలదని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో 49% ఎఫ్‌డీఐలను సమర్ధిస్తూ.. ‘ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ యంత్ర పరికరాలను.. కొన్నేళ్లలో ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరాలన్నదే నా లక్ష్యం’ అన్నారు. ‘ముంబై నుంచి మాట్లాడుతున్నా కాబట్టి.. చత్రపతి శివాజీని గుర్తుచేసుకోవడం సమంజసం. నౌకాదళం వ్యవస్థీకృతమైంది ఆయన కాలంలోనే’ అని మోడీ గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ నౌకదళానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఐఎన్‌ఎస్ కోల్‌కతా ప్రత్యేకతలు
► ఇది మాజెగావ్ డాక్‌యార్డ్‌లో తయారైంది.
► క్షిపణి విధ్వంసక వ్యవస్థ కలిగిన మొదటి కోల్‌కతా క్లాస్ యుద్ధనౌక.
► దీని బరువు 6,800 టన్నులు, పొడవు 164 మీటర్లు. వెడల్పు 18 మీటర్లు.
► 4 గ్యాస్ టర్బైన్ జనరేటర్ల సాయంతో 4.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.
► ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల ఈ క్షిపణులు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.
► ఇందులో ఇజ్రాయెల్ తయారీ ‘ఎంఎఫ్ స్టార్’ రాడార్‌ను ఏర్పాటు చేశారు. ఇది శత్రు క్షిపణులను 250 కి.మీల దూరం నుంచే గుర్తిస్తుంది. అంతేకాదు, ఒకే సమయంలో వందల లక్ష్యాలను పరిశీలించి.. క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలదు.
రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఈపీసీ
మహారాష్ట్రలో మరో రెండు కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. నవసేవలో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎస్‌ఈజెడ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేందుకు త్వరలో రాష్ట్రాలకు అనుమతిస్తామని వెల్లడించారు. ఎగుమతుల్లో వృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. అనంతరం షోలాపూర్‌లో షోలాపూర్- రాయచూర్ విద్యుత్ సరఫరా లైన్లను జాతికి అంకితం చేశారు. ఆ తరువాత పూణె- షోలాపూర్‌ల మధ్య 4 లేన్ల రహదారిని మోడీ ప్రారంభించారు.