
ముంబై : పోలీసుల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడిన ఆ ఖాకీ మనసు కరగలేదు. మధ్యప్రదేశ్ గ్వాలియార్‌కు చెందిన ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు.. చిన్న పిల్లల్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ అధికారి వారి దగ్గరకు వచ్చాడు. వారిని ప్రశ్నించే ఉద్దేశంతో.. అందరిని పైకి లేవమని చెప్పాడు. అతన్ని చూడగానే ఆ మహిళలంతా పక్కకు జరగడానికి ప్రయత్నిస్తూ.. ఏడుస్తూ తమను వదిలిపెట్టమని ఆ అధికారిని వేడుకుంటున్నారు.
ఇంతలో ఆ అధికారి ఓ మహిళ దగ్గరకు వెళ్లి లాఠీతో పదే పదే కొట్టాడమే కాక జుట్టుపట్టుకుని లాగాడు. ఆ మహిళ తనను విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా సదరు అధికారి కరుణించలేదు. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు స్టేషన్‌లో మరో ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. వారిలో ఒకతను సదరు మహిళ దగ్గరకు వచ్చి ఆమెను తిట్టడం ప్రారంభించాడు.
ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియో గురించి గ్వాలియర్ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ఈ వీడియో ఇప్పటది కాదని రెండేళ్ల క్రితందని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాతే దీని గురించి వారికి తెలిసిందని వెల్లడించారు. వీడియోలో ఉన్న అధికారి ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నాడన్నారు. ఎలక్షన్స్ అయ్యాక ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఆరోదశ ఎన్నికల్లో భాగంగా గ్వాలియార్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment