సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయాన దొంగదెబ్బ తీసేందుకు భారత్‌లో భారీ దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. సముద్ర మార్గం ద్వారా పాక్‌కు చెందిన అండర్‌వరల్డ్, స్మగ్లింగ్ మాఫియా ముఠా సాయంతో భారత్‌లో ఉగ్ర దాడికి పాకిస్తాన్ ప్రేరేపిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పశ్చిమ తీరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ ఈ కుట్రకు తెరలేపినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్‌లోని ఓ పోర్టు ప్రాంతంలో పాక్ అండర్‌వరల్డ్, స్మగ్లింగ్ గ్రూప్‌ల కోసం ఐఎస్‌ఐ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు పసిగట్టాయి.
వారికి వనరులు సమకూర్చడంతో పాటు ప్రతిఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో కూడా పాక్ ఏజెన్సీలు శిక్షణ ఇచ్చాయని తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన బోట్ల ద్వారా డ్రగ్స్ రవాణా సాగుతున్నదని, వీటిలో కొన్ని సందర్భాల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలిస్తున్నారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపరుస్తున్నా భారత్‌పై దాడులకు పాక్ తన వ్యూహాలకు పదునుపెడుతూనే ఉందని వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ యదేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment