ఢిల్లీ అల్లర్లు: అంతర్జాతీయ మీడియా ఫైర్‌ | International Media Attack on Delhi Riots | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి

Published Sat, Feb 29 2020 2:13 PM | Last Updated on Sat, Feb 29 2020 2:17 PM

International Media Attack on Delhi Riots - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో చురుగ్గా పర్యటిస్తూ భారత దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తుండగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వ పరువును, దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజులపాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటిపై ప్రపంచ పత్రికలు తమదైన రీతిలో దాడి చేశాయి.

బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలే అల్లర్లకు దారి తీశాయని పలు అంతర్జాతీయ పత్రికలు దూషించాయి. అల్లర్లను నిలువరించాల్సిన పోలీసులే ఓ వర్గానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించడం దారుణంగా ఉందని కొన్ని పత్రికలు ఆరోపించాయి. అల్లర్ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం వల్లనే ‘2002లో గుజరాత్‌’ తరహా అల్లర్లు పునరావృతం అయ్యాయని ఆ పత్రికలు వ్యాఖ్యానించాయి. (పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..)

‘మోదీ స్టోక్డ్‌ దిస్‌ ఫైర్‌’ అనే శీర్షికతో ‘ది గార్డియన్‌’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘పోలిటిషియన్స్‌ స్టోక్డ్‌ ఢిల్లీ రైట్స్‌’ అని ‘ది ఖలీజ్‌ టైమ్స్‌’ వార్తను ప్రచురించగా, ‘మోదీ సైలెన్స్‌ యాజ్‌ డెత్‌ టాల్‌ మౌంటెడ్‌’ అనే శీర్షికతో లండన్‌ నుంచి వెలువడుతున్న ‘ది టైమ్స్‌’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘శాంతి, సహనమే మన సంస్కృతి’ అంటూ అల్లర్లు చెలరేగిన మూడో రోజు ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలసి మోదీ భుజం భుజం రాసుకుంటూ ఢిల్లీ రోడ్డుపై తిరుగుతుంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అల్లర్లు చెలరేగాయంటూ జర్మనీ వార్తా పత్రిక ‘డర్‌ స్పీజల్‌’ వార్తను ప్రచురించింది. ఈ అల్లర్లు మోదీ ప్రభుత్వానికి అంతర్గతంగా ఉపయోగ పడవచ్చేమోగానీ అంతర్జాతీయంగా భారత్‌ పరువు తీస్తున్నాయంటూ ‘అవుట్‌సైడ్‌ షో ఆఫ్, ఇన్‌సైడ్‌ ప్రొటెస్ట్‌’ శీర్షికన ఆ పత్రిక వార్తను ప్రచురించింది. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ బదిలీ ఓ శేష ప్రశ్న!)

మోదీ హిందూత్వ పాలనలో సెక్యులరిజమ్‌ చనిపోయిందంటూ ‘వై ఇండియా స్టూడెంట్స్‌ ఆర్‌ ఆంగ్రీ, ఇట్స్‌ ముస్లిం ఆర్‌ వర్రీడ్‌’ శీర్షికతో ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈశాన్య ఢిల్లీలో అక్బారీ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా తగులబెట్టడం ఏ నాగరికతను సూచిస్తోందని ‘ఏ గల్ఫ్‌ న్యూస్‌ పీస్‌’ ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా విద్వేషపూరిత ఉపన్యాసమే అల్లర్లకు దారితీసిందని, ముస్లిం పౌరులను హిందూ శక్తులు చంపుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర వహించాయంటూ ‘ది రూట్స్‌ ఆఫ్‌ ది ఢిల్లీ రైట్స్, ఏ ఫియరీ స్పీచ్‌ అండ్‌ యాన్‌ అల్టిమేటమ్‌’ పేరిట ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వార్తను ప్రచురించింది.


ప్రభుత్వం చేసిన చట్టాన్ని ప్రశ్నించే మేధోవారసత్వంతోపాటు నైతిక, ప్రజాస్వామిక హక్కులు తమకున్నాయంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ముస్లింలపై దాడి చేయడం ఆశను ఆర్పేసిందంటూ ‘అల్‌ జజీరా’ వ్యాఖ్యానించింది. విభిన్న కుల, మతాల సమ్మేళనంతో సహజీవనం సాగించడం భారత్‌కున్న ఓ గొప్ప సంస్కృతి అన్న పేరు నేటి ఢిల్లీ అల్లర్లతో మసకబారిందంటూ ‘గల్ఫ్‌ న్యూస్‌’ సంపాదకీయం రాసింది. (చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement