మోదీ మెరుపుదాడి గురి తప్పిందా? | Is PM Narendra Modi's - currency ban move leaked before? | Sakshi
Sakshi News home page

మోదీ మెరుపుదాడి గురి తప్పిందా?

Published Mon, Nov 14 2016 1:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

మోదీ మెరుపుదాడి గురి తప్పిందా? - Sakshi

మోదీ మెరుపుదాడి గురి తప్పిందా?

  • ఇది ఎలా జరిగింది?
  • కొత్త కరెన్సీ రహస్యం  కొన్ని వర్గాలకు ముందే ఎలా తెలిసింది?
  • (ఇంటర్నెట్ ప్రత్యేక కథనం)
     
    హైదరాబాద్ : దేశాన్ని కుదిపేస్తున్న కొత్త కరెన్సీ కథ కొంతమందికి ముందే తెలిసిందా? పై స్థాయి రాజకీయ, వ్యాపారవర్గాలకు అది ముందుగానే లీక్ అయిందా? కొత్త రూకల వ్యవహారం రాజకోట రహస్యమనీ, అది మూడో కంటికి తెలియదనీ,  అలా తెలియకూడదనే ఆకస్మిక నిర్ణయం ప్రకటించామనీ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నా వాస్తవ'చిత్రం' మాత్రం దానికి భిన్నంగా ఉంది. బ్లాక్ మనీపై  'సర్జికల్ స్ట్రైక్' గా అంతా అభివర్ణించిన ఈ చర్య సామాన్యుల పాలిట పిడుగుపాటుగా పరిణమించగా, నల్లబాబులు మాత్రం ముందుగానే ఇల్లు చక్కబెట్టుకున్నారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
     
    1. మరో పక్షం రోజుల్లో కొత్త 2000 నోట్లు రానున్నాయంటూ మొహిత్     
    గులాటీ నవంబర్ 5 న ట్విటర్ లో పోస్టు చేశారు.   2.) మొహిత్ గులాటీ ట్వీట్ పై స్పందించిన ఇతరుల కామెంట్లు
                                                                               
     
     
    ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొందరు చేసిన సంచలన పోస్టులు ఈ అనుమానాలను ధ్రువపరుస్తున్నాయి. బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ కో- కన్వీనర్ సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు మూడు రోజుల ముందే రూ.2,000 నోట్ల కట్టల ఫోటోలను ట్విట్టర్ లో పెట్టారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రస్తావించారు. అదొక్కటే కాదు, మరి కొందరు సైతం ఈ నోట్ల సంగతిని నవంబర్ 5 వ తేదీనాడే ట్విట్టర్ లో పెట్టారు. అది కూడా ఫోటోలతో సహా.
     
    మోహిత్ గులాటీ అనే వ్యక్తి  పక్షం రోజుల్లో కొత్త రెండు వేల రూపాయల నోట్లు వస్తాయని నవంబర్ 5 నే  ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ పోస్టుతో పాటు పింక్ రంగులో ఉన్న నోట్ల కట్టల ఫోటోలను కూడా పోస్టు చేశారు. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పమని మన్ దీప్ ఆశియా అనే వ్యక్తి అడిగితే "భాయ్... కాన్ఫిడెన్షియల్ ... సారీ" అని మోహిత్ బదులిచ్చాడు. ఆర్బీఐ హిందీలిపిలో నోటు విలువను ముద్రించదని దీనిపై మరొకరు సందేహం కూడా వ్యక్తం చేశారు. ఇది నిజమేనా? ఆర్బీఐ నుండి అధికారిక సమాచారమేదీ లేదే? అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే తనకు నోట్ల మార్పిడిలో 786 నంబర్ ఉన్న రెండు వేల నోటు వచ్చిందని కూడా మోహిత్ ట్వీట్ చేసి ఆ నోటు తాలూకు ఫోటో కూడా పెట్టాడు.
     
    3.) కొత్త 2000 నోట్లను చూపించే చిత్రంతో పాటు ఆర్పీఐ త్వరలోనే కొత్త 2000 నోట్లను విడుదల చేయబోతోందని చెబుతూ  పంజాబ్ బీజేపీ లీగల్ సెల్ నాయకుడు సంజయ్ కాంభోజ్ చేసిన ట్వీట్
     

    ఇదంతా ఇలా ఉంటే, నవంబర్ 5న బీజేపీ నేత సంజీవ్ కాంభోజ్ కూడా రెండు వేల రూపాయల బండిల్స్ ఫోటోను ట్వీట్ చేశారు. 'రిజర్వ్ బ్యాంక్ టు ఇష్యూ రుపీస్ 2000 కరెన్సీ నోట్ ఇన్ ఇండియా సూన్' అని ట్వీట్ కూడా పెట్టారు. కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడం పరమ రహస్యమే అయితే వీళ్లందరికీ అది ముందుగానే ఎలా తెలిసింది? అది కూడా ప్రధాని ప్రకటన చేసిన నవంబర్ 8 కంటే మూడు రోజుల ముందే! మోహిత్ గులాటీ ట్వీట్ చేసిన ఫోటోను అంకితా రాజేశ్వరి అనే ఆన్ లైన్ జర్నలిస్టు నవంబర్ 6 నాడు 'టైమ్స్ ఆఫ్ ఇండియా సైట్' లోని తన బ్గాగ్ లో ఉంచారు కూడా. Twitter abuzz with new Rs 2,000 banknote from RBI. Leaked photos or a hoax?  అన్న శీర్షికతో వ్రాసిన ఈ బ్లాగ్ లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుజరాతీ పత్రికల్లో అక్టోబర్ లోనే వెయ్యి, ఐదొందల నోట్ల రద్దుపై ముందస్తు వార్తాకథనాలు వెలువడిన సంగతి కూడా వెలుగులోకి వచ్చింది.
     
    వెయ్యి నోటు రద్దు తప్పిదం సరిదిద్దుకునేందుకేనా?
    కొత్త కరెన్సీ వ్యవహారం చాలా మందికి ముందే తెలుసని ఇప్పుడిప్పుడే తెలుస్తుండగా, రూ. 1000 నోటు రద్దు వెనుక కూడా పెద్ద కథే ఉందని చెబుతున్నారు. గత డిసెంబర్ లో వెయ్యి నోటు ముద్రణకు సంబంధించి ఒక పెద్ద పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు కోటి వెయ్యి నోట్లలో పొరపాటు జరిగినట్లు ఆర్బీఐ వర్గాలు అంటున్నాయి. ఈ నోట్లలో ఎంతో కీలకమైన 'సెక్యూరిటీ త్రెడ్' మిస్ అయింది. ఈ సెక్యూరిటీ త్రెడ్ లో RBI, 1000 ఇంగ్లీషులోను, భారత్ అనే  అక్షరాలు దేవనాగరి లిపిలోను ఉంటాయి. 
     
    తప్పుగా ముద్రితమైన వెయ్యి నోటులో ఈ త్రెడ్ కనిపించదు. హోషంగాబాద్ సెక్యూరిటీ మిల్ నుండి దీనికి కావలసిన పేపర్ సరఫరా అయింది. సెక్యూరిటీ త్రెడ్ ను గుర్తించకుండానే అధికారులు ఆర్బీఐ  కరెన్సీ చెస్ట్ లకు సదరు నోట్లతో సహా మొత్తం 200 మిలియన్ల నోట్లను జనవరి 2016లో పంపించి వేశారు. ఆ తర్వాత ఎప్పుడోగానీ జరిగిన పొరపాటును గుర్తించారు. అలాంటి నోట్లు కనుక వస్తే రిజర్వ్ బ్యాంకుకు జమ కట్టేయమని బ్యాంకులన్నిటికీ ఆదేశాలు అందాయి.
     
    4.) 500, 1000 నోట్లను రద్దు చేస్తారంటూ ఆరు నెలల కిందటే గుజరాతీ పత్రికలో అచ్చయిన కథనం
     
     
     
    కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ పీ ఎం సి ఐ ఎల్) కు చెందిన నాసిక్ ప్రెస్ లో ఈ తప్పిందం జరిగిందట. ఈ వ్యవహారంపై ది హిందూ దినపత్రిక ముంబై నుండి 2016 జనవరి 1న 'RBI tells banks to replace defective 1,000-rupee notes' శీర్షికతో ఒక వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది. ఈ తప్పిదానికి ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారని కూడా తెలుస్తోంది. 
     
    5.) 2000 నోట్లు రాబోతున్నాయంటూ అక్టోబర్ 27 న దైనిక్ జాగరణ్ ప్రచురించిన కథనం
     
     
     
    2015 మార్చి 31 నాటికి  5,612 మిలియన్ల 1000 డినామినేషన్ నోట్లు సరఫరా లో ఉన్నాయి. దేశంలోని మొత్తం కరెన్సీ విలువలో ఇది 39.3 శాతం. ఈ నోట్ల వల్ల దొంగనోటుకు అసలు నోటుకు తేడా గుర్తించడం కష్టమైపోయింది. అసలు నోటు కూడా దొంగనోటై పోయింది. దీనిపై గత ఏడెనిమిది నెలలుగా ఆర్బీఐ, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. నోట్ల రద్దుతోనే ఈ సమస్య తీరుతుందని నిర్ణయానికి వచ్చారు. తప్పిదం జరిగిందని అంగీకరిస్తే భారత ప్రభుత్వం ప్రతిష్ఠ మసకబారుతుంది. 
     
    అందుకే నల్లధనంపై యుద్ధంగా ప్రకటించి కాగలకార్యం పూర్తి చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది. కేవలం రూ.1000 నోటును రద్దు చేస్తే అనుమానాలు తలెత్తుతాయని భావించి పనిలో పనిగా రూ.500 నోటును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకే కొన్ని నెలల్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ.1000 నోటును మళ్లీ విడుదల చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది.
     
    6.) వెయ్యి రూపాయల నోటుపై ఉండాల్సిన సెక్యూరిటీ త్రెడ్
     
     
    వెయ్యి నోటు నల్లధనానికి తావిస్తోందని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ఏకంగా రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. మళ్లీ వెయ్యి నోటు కూడా వస్తుందని ప్రకటించారు. ఈ చర్యలు మున్ముందు బ్లాక్ మనీకి మరింత వెసులుబాటు కలిగిస్తాయని పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెరసి నల్లధనంపై మోదీ సదుద్దేశంతోనే యుద్ధం ప్రకటించినా కూడా అది గురి తప్పిందేమోనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement