అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ గుజరాత్‌లో భారీ విధ్వంసానికి పూనుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ దళాలు ఇటీవల సరిహద్దు తీరంలో నాలుగు భారత ఫిషింగ్ బోట్లను, వాటి సిబ్బంది నుంచి యూఐడీలను స్వాధీనం చేసుకోవడంతో గుజరాత్‌పై 26/11 తరహా దాడులకు పాక్ ప్రేరేపించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ర్యాలీలు, జనసమూహాలపై పాక్ ఉగ్రవాదులు దాడులతో తెగబడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ అధికారులను అప్రపమత్తం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండటంతో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ లక్ష్యంగా సముద్ర మార్గం నుంచి ఉగ్రవాదులను ఐఎస్‌ఐ పంపవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
భారత ఫిషింగ్ బోట్స్‌ను, వాటి యూఐడీలను సీజ్ చేసిన పాక్ అధికారులు ఇతర బోట్లపై ఆ యూఐడీలను అమర్చి భారత బోట్స్‌గా అధికారుల కళ్లుగప్పి మిలిటెంట్లను గుజరాత్‌లో చొప్పించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రం కావడంతో గుజరాత్‌లో మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయనుండటం, యూపీ సీఎం ద్వారకా వంటి పలు తీర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొననుండటంతో పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి చొచ్చుకువచ్చి దాడులకు తెగబడే అవకాశాలు తోసిపుచ్చలేమని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
నవంబర్ 2008లో మత్స్య నౌక ఎంవీ కుబేర్‌ను హైజాక్ చేసి పాక్ మిలిటెంట్లు ముంబయిలో మారణహోమం సృష్టించిన అనంతరం అధికారులు మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు, యూనిక్ ఐడెంటిఫికేషన్ డివైజ్‌లు (యూఐడీ) అందచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment