
శ్రీహరికోట/తిరుమల: ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 27 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వాతావరణం సహకరిస్తే బుధవారం సాయంత్రం సరిగ్గా 5.08 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లనుంది. గజ తుపాను కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం తెలిసిందే. మొత్తంగా ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.
శ్రీవారి పాదాల చెంత పూజలు
ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ కె.శివన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని, నెల్లూరు జిల్లాలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయంలో రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల శివన్ మాట్లాడుతూ ‘వాతావరణం సహకరించకపోతే జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం వాయిదా పడుతుంది. అయితే రేపు సాయంత్రమే రాకెట్‌ను ప్రయోగించగలమని మేం ఆశిస్తున్నాం. ఇస్రోకు అత్యంత ముఖ్యమైన ప్రయోగాల్లో ఇదొకటి. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది మైలురాయి వంటిది’ అని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరింత అధునాతన ఉపగ్రహాలను అభివృద్ధి చేసేందుకు ఇస్రోకు మార్గం సుగమమవుతుందన్నారు. ‘చంద్రయాన్–2, అంతరిక్ష మానవ సహిత యాత్ర ప్రయోగాలను కూడా జీఎస్‌ఎల్వీ–మార్క్3 రాకెట్ ద్వారానే చేపట్టనున్నాం. మేం అందుకు సన్నద్ధమవుతున్నాం’ అని శివన్ చెప్పారు. జీఎస్‌ఎల్వీ–మార్క్3 ఇస్రో అభివృద్ధి చేసిన ఐదో తరం రాకెట్. 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇది భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో–జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టగలదు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment