
ఐటీ వేట మొదలైంది!
- నోట్లరద్దు తర్వాతి డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి
- పీఎంజీకేవై ముగిశాక ఎవరినీ వదలం
- ఆదాయపన్ను శాఖ కమిషన్ ఏకే చౌహాన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: నోట్లరద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక బ్యాంకు అకౌంట్లలోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఆదాయపన్ను శాఖ దృష్టిపెట్టింది. పరిమితికి మించి అనుమానాస్పదంగా డబ్బుల లావాదేవీలు జరిగిన అకౌంట్లను పరిశీలిస్తోంది. ఢిల్లీలో వ్యాపార సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లు, నిపుణులతో సమావేశమైన ఐటీ శాఖ కమిషనర్ ఏకే చౌహాన్.. దీనిపై వివరణ ఇచ్చారు.
ఇప్పటికే పలు అకౌంట్లలోకి లెక్కలో చూపని ధనాన్ని వేసిన వారు.. ప్రధాన మంత్రి గ్రామీణ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద పన్ను చెల్లించాలన్నారు. లేకుంటే గడువు ముగిశాక విచారణలో బయటపడ్డ నల్లధన కుబేరులకు కఠిన పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ‘బ్యాంకు అకౌంట్లను, డిపాజిట్లను పరిశీలిస్తున్నాం. అందుకే పీఎంజీకేవై పథకాన్ని వినియోగించుకోవాలనుకునేవారు నిశ్చింతగా ఉండొద్దని చెబుతున్నా. ఆర్థిక ఇంటెలిజెన్స్ యూనిట్, ఇతర సంస్థలిచ్చే వివరాలను విశ్లేషిస్తున్నాం. అంతకుముందే పీఎంజీకేవై పథకం ప్రకారం పన్ను చెల్లించండి. ఒకసారి పథకం గడువు ముగిస్తే.. ఎగవేతదారులకు కష్టాలు తప్పవు’ అని చౌహాన్ హెచ్చరించారు.
పీఎంజీకేవై అనేది ‘ఆదాయ వెల్లడి పథకం పార్ట్ –2’ అనుకోవద్దని.. దీని ఉద్దేశాలు పూర్తిగా వేరని స్పష్టం చేశారు. నల్లధనం నుంచి బయటకు వచ్చేందుకు ఇదే చివరి అవకాశమన్నారు.