ప్రతి ఒక్కరూ వీఐపీనే! | It is time of EPI not VIPs: PM Modi | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ వీఐపీనే!

Published Mon, May 1 2017 1:53 AM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM

ప్రతి ఒక్కరూ వీఐపీనే! - Sakshi

ప్రతి ఒక్కరూ వీఐపీనే!

వీఐపీ భావనను తొలగించేందుకే ఎర్రబుగ్గలకు నో చెప్పాం
► పౌరులంతా ముఖ్యమే అన్న భావన గొప్ప శక్తినిస్తుంది
► మాసాంతపు మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ: కొందరు వ్యక్తుల మనస్సుల్లోంచి వీఐపీ (వెరీ ఇంపార్టెంట్‌ పర్సన్‌) అనే భావన తీసేసేందుకే వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మాసాంతపు మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వీఐపీ స్థానంలో ఈపీఐ – ఎవ్రీ పర్సన్‌ ఇంపార్టెంట్‌ (ప్రతి ఒక్కరూ ముఖ్యమే) అనే భావనను చేర్చనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎర్రబుగ్గ ఉన్న వాహనంలో వెళ్లటం కొందరి మనసుల్లో పాతుకుపోయిన వీఐపీ సంస్కృతిని పారదోలేందుకే మే 1 నుంచి కొత్త నిబంధనలను అమలుచేస్తామన్నారు.  దేశంలోని 125 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికీ సమాన విలువ, ప్రాముఖ్యత ఉందన్నారు. ‘దేశంలో వీఐపీ సంస్కృతిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ భావన వేళ్లూనుకుపోయింది.

ఎర్రబుగ్గ వాహనాల్లో తిరిగే వారు మేమంతా వీఐపీలం అనే మైండ్‌సెట్‌తో ఉన్నారు. అందుకే ఇటీవలే మా ప్రభుత్వం.. ఎంతటివారైనా సరే తమ వాహనాలపైనుంచి ఎర్రబుగ్గలు తొలగించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం తనతోపాటుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులందరికీ వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నవభారతం’ అనే ఆలోచన.. వీఐపీ అనే భావనను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యమే (ఈపీఐ)ననే భావనకు మరింత ప్రాముఖ్యత కల్పించేందుకేనన్నారు. ‘దేశంలోని 125 కోట్ల మంది ప్రజల ప్రాముఖ్యతను మనం గౌరవించాలి. ఈ భావన ప్రజల కలలను నిజం చేసే దిశగా దేశానికి గొప్ప శక్తినిస్తుంది. మనమంతా సంయుక్తంగా దీన్ని సాధించాలి’ అని  చెప్పారు.  

డిజిటల్‌ చెల్లింపుల దిశగా..
కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ లావాదేవీల నిర్ణయానికి మద్దతుగా.. భీమ్‌ యాప్‌ను విరివిగా వినియోగించాలని, ఇతరులకు భీమ్‌ యాప్‌ను ప్రతిపాదించటం ద్వారా రివార్డులు పొందాలని యువతను కోరారు. అక్టోబర్‌ 14 వరకే ఈ పథకం ఉంటుందని.. దీని వల్ల కలిగే లాభాలను యువత అందుకోవాలన్నారు. ‘మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం మీకో గొప్ప అవకాశాన్ని కల్పించింది. కొత్త తరం దాదాపు నగదు రహిత లావాదేవీలకే మొగ్గుచూపుతోంది. డిజిటల్‌ చెల్లింపులకే విశ్వాసం చూపుతోంది. అందుకే మీరు రోజుకు 20 మందికి భీమ్‌ యాప్‌ను వాడటాన్ని సూచిస్తే.. మీరు ఆరోజు రూ. 200 సంపాదించినట్లే. దీని వల్ల మీకు లాభం కలగటంతోపాటు డిజిటల్‌ ఇండియాకు సహాయం చేసినట్లవుతుంది’ అని మోదీ సూచించారు.

బుద్ధుని బోధనల అమలు అవసరం
త్వరలో శ్రీలంకలో తన పర్యటన, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ‘వేసాక్‌ డే’ కార్యక్రమం గురించీ మాట్లాడారు. ప్రపంచంలో హింస, యుద్ధం, విధ్వంసం, ఆయుధ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో బుద్ధుడి బోధనలు చాలా అవసరం అన్నారు. వాతావరణ నియమాలు మారుతున్నాయని.. గతంలో మే, జూన్‌లలో కనిపించే ఎండలు ఈసారి మార్చి, ఏప్రిల్‌లోనే భయపెడుతున్నాయన్నారు.

వేసవికాలంలో ..పక్షులు, జంతువులపై మానవత్వం చూపించాలన్నారు. వరండాల్లో చిన్న తొట్లలో పక్షుల కోసం నీళ్లుంచాలని సూచించారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు.. ఆటో డ్రైవింగ్, ఇతర భాషలోని కొత్త పదాలు నేర్చుకోవటం వటి కొత్త నైపుణ్యాలు ఒంటబట్టించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు.

సార్క్‌ దేశాలకు అమూల్య కానుక
మే 5న దక్షిణాసియా ఉపగ్రహాన్ని భారత్‌ ఆవిష్కరించనున్నట్లు వెల్లడించిన ప్రధాని.. ఇది ఇరుగుపొరుగు దేశాలకు అమూల్యమైన కానుకని పేర్కొన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ ఆలోచనలో భాగంగానే ఇరుగు, పొరుగు దేశాలకూ మేలు జరుగుతుందన్నారు. 8 సార్క్‌ దేశాల్లో 7(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్‌) ఈప్రాజెక్టులో చేరేందుకు అంగీకరించగా.. పాకిస్తాన్‌ ‘ఈ గిఫ్ట్‌ మాకొద్ద’ని తిరస్కరించింది. ‘ఇరుగుపొరుగుకు సహకారం కావాలి. వారూ అభివృద్ధి చెందాలి’ అని ప్రధాని అన్నారు. ‘దక్షిణాసియా విషయంలో మా చిత్తశుద్ధికి ఇదే సరైన ఉదాహరణ’ అని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement