
శనివారం పూరీలో ప్రారంభమైన జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న అశేష భక్త జనం
భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని రథ యాత్ర శనివారం పూరీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తజన సందోహం నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలతో కూడిన రథాలు శ్రీ మందిరం నుంచి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరాయి. పూరీ గజపతి మహారాజా దివ్య సింఘ్ దేవ్ రథాల్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి దేవతలకు మంగళ హారతి సమర్పించడంతో యాత్ర ప్రారంభమయింది.
జగన్నాథుని నందిఘోష్ రథం సకాలంలో శనివారం సాయంత్రానికి గమ్యం చేరలేక పోయింది. గుండిచా మందిరానికి సమీపంలో ఆగిపోయింది. దీంతో ఇక్కడే రథంపై ఉన్న జగన్నాథునికి సేవాదులు నిర్వహిస్తారు. కాగా, రథయాత్ర సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో భారీగా సీసీ టీవీలను అమర్చారు. సుమారు 5,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.