జానారెడ్డి ఆవేదన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని బలంగా నమ్మిన కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తన ఆవేదనను అధిష్టానంతో పంచుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తే చివరకు తనకు అవమానమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
అయితే పీసీసీల కూర్పు వెనక అనివార్య పరిస్థితుల్లో సామాజిక సమీకరణలు చూడాల్సి వచ్చిందని, ఇది అవమానించడం కాదని దిగ్విజయ్ సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం దిగ్విజయ్‌సింగ్ జానారెడ్డిని సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు. బలహీనవర్గాలకు కేటాయించడం కారణంగా ఇవ్వలేకపోయామని, మంచి జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతూ పార్టీని విజయపథంలో నడిపించాలని సోనియా సూచించినట్టు సమాచారం.