చెన్నై, సాక్షి ప్రతినిధి:కేరళ, ఒడిశా ముఖ్యమంత్రులు కొత్త ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తరుణంలో అమ్మకూడా ఢిల్లీ పయనానికి సిద్ధమయ్యూరు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి బయలుదేరిన ఆమె 11 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ తమిళనాడు భవన్ వద్ద ఆమెకు అన్నాడీఎంకే ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భవన్‌లో కొత్తగా నిర్మించిన సీఎం సూట్‌ను ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధానిని కలిశారు. అభివృద్ధి కార్యక్రమాలకు అదనపు నిధులు, కావేరీ, ముల్లైపెరియార్ సమస్య, విద్యుత్ కోతను అధిగమించేందుకు అదనపు విద్యుత్, శ్రీలంక- తమిళనాడు జాలర్ల మధ్య నలుగుతున్న సమస్య తదితర అంశాలపై ఆమె ప్రధానికి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని సైతం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి ఆర్దిక సహకారాన్ని కోరారు. అధికారికంగా తెరపై డిల్లీ పర్యటన ఇలా సాగగా, తెరవెనుక రాజకీయంలో మరో కోణం దాగి ఉందని అనుమానిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఒకప్పటి మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకునేందుకు బీజేపీ అర్రులు చాచింది. సుమారు ఆరు నెలల ముందు నుంచే పార్టీ అగ్రనేతలు అమ్మను కలుస్తూ వచ్చారు. అయితే ఒంటరిగానే రంగంలోకి దిగేందుకు జయ సిద్ధపడడంతో అన్నాడీఎంకే వైరివర్గాలైన డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే తదితర పార్టీలతో బీజేపీ జతకట్టింది.
ఎన్‌డీఏ, యూపీఏలకు పూర్తి మెజార్టీ రాకుంటే మూడో ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థిగా పోటీపడవచ్చని జయ భావించడమే ఒంటరిపోరుకు ప్రధాన కారణంగా భావించవచ్చు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ బలమైన ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని మిత్రపక్షాల నేతలు కాలర్ ఎగరేసుకునేలా చేసింది. బీజేపీ కూటమి అభ్యర్థి పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌కు కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరో బీజేపీ నేతకు కూడా కేంద్రంలో చోటుదక్కవచ్చని తెలుస్తోంది. కూటమి నేతలకు మంత్రి పదవులను కట్టబెట్టడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తలపడాలని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని నేడు బద్ద శత్రువుగా మారిన డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత సైతం మోడీ వద్ద మంచి మార్కులు కొట్టేశారు.
రాజ్యసభ సీటుకోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండేళ్లలో (2016) అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశస్థాయిలో మోడీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇదే విధంగా కూటమి పార్టీలు ముందుకు వెళితే ముప్పుతప్పదని అమ్మ అంచనా వేశారు. రాష్ట్రంలో మంత్రి పదవుల పందేరం ప్రారంభం కాకముందే బీజేపీకి దగ్గరయ్యేలా అమ్మ డిల్లీ పర్యటన సాగించారు. రాజ్యసభలో బిల్లు పాసయ్యేందుకు బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదు. అన్నాడీఎంకేతో చెలిమి చేయడం ద్వారా ఆ పార్టీకి చెందిన పదిమంది సభ్యులు తోడవుతారు. ఈ రకంగా బీజేపీకి కూడా అమ్మతో లాభం. అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుంటే లోక్‌సభ ఎన్నికల్లోని మిత్రపక్షాలన్నీ బీజేపీకి దూరం కాక తప్పదు. మోడీ చరిష్మాకు అమ్మ ప్రాభవాన్ని జత చేయడం ద్వారా రాబోయే అసెంబ్లీని మరోసారి తన్నుకుపోయేలా డిల్లీ పర్యటన వెనుకనున్న రాజకీయంగా భావిస్తున్నారు.
ముండేకు జయ సంతాపం
కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే కారు ప్రమాదంలో మృతి చెందడం పట్ల తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. దేశం ఒక కార్యదక్షతగల మంత్రిని కోల్పోయిందని సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి మృతికి సంతాప సూచకంగా చెన్నై సచివాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.
మోడీతో దోస్తీ
Published Tue, Jun 3 2014 11:10 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement