
జయ ఆస్తుల వివరాలు
చెన్నై: జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా వెలుగు చూసిన ఆస్తుల వివరాలు...
జయలలితకు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన భవనంతో పాటు తమిళనాడులోనే పలు చోట్ల బంగళాలు, వ్యవసాయ భూమి, నీలగిరిలో తేయాకు తోట, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, రెండు లగ్జరీ కార్లు తదితర ఆస్తులు ఉన్నాయి.
1997లో చెన్నైలోని జయలలిత నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించినప్పడు...800 కేజీల వెండి, 28 కేజీల బంగారం, 750 జతల పాదరక్షలు, 10,500 చీరలు, 91 వాచీలు తదితర విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున స్థిరాస్తులను కూడా జయ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. జయలలితకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 651.18 చదరపు మీటర్ల స్థలంలో భవనం. జీడిమెట్ల, రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌లో 11.35 ఎకరాల్లో ద్రాక్ష తోట, రెండు ఫామ్ హౌస్‌లు, కార్మికుల కోసం ఇళ్లు ఉన్నాయి. అలాగే, మేడ్చల్ సమీపంలో 3.15 ఎకరాల స్థలం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆంజనేయ తొట్టంలో 222.92 చదరపు మీటర్ల స్థలంలో భవనం ఉంది.
అయితే, వీటిలో కొన్ని ఆస్తులు జయలలిత ఒకనాటి ఇష్టసఖి శశికళ, నాటి దత్త పుత్రుడు సుధాకరన్, శశికళ సోదరుని కోడలు ఇళవరసిల పేరు మీద ఉండడంతో వారు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. వీటికి తోడు సుధాకరన్ వివాహం కోసం జయ రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్లు గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.