కర్ణాటకను భయపెడుతున్న 'తెల్లచీర'
బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రస్తుతం 'తెల్లచీర' భయపెడుతోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత జైలు నిబంధనల ప్రకారం తెల్ల దుస్తులు ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దాంతో కర్ణాటక సర్కార్తో పాటు జైలు అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. తెల్ల చీర ధరించేలా జయలలితపై ఒత్తిడి తెస్తే పరిస్థితులు ఎలా మారుతాయోనని హడలి పోతున్నారు.
మరోవైపు జయ ఉన్న జైలు బయట తమిళ తంబీలు, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలు,ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలిస్తే ఎక్కడ ఉద్రిక్తతలు నెలకొంటాయోనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో జయలలితను తమిళనాడు జైలుకే పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.