జయలలిత మాట్లాడుతున్నారు! | jayalalithaa talking, responding to treatment, say apollo doctors | Sakshi
Sakshi News home page

జయలలిత మాట్లాడుతున్నారు!

Published Fri, Oct 21 2016 7:29 PM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

జయలలిత మాట్లాడుతున్నారు! - Sakshi

జయలలిత మాట్లాడుతున్నారు!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత మళ్లీ ఆమె హెల్త్ బులెటిన్‌ను వైద్యులు వెల్లడించారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని.. అయితే ఇంకా మరికొన్ని రోజులు మాత్రం ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను గత నెల రోజులుగా కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 
 
అమ్మ కూర్చున్నారని, మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దాంతో కొన్నాళ్ల తర్వాత అయినా.. జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరపడుతున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె క్షేమం కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేలాదిమంది అభిమానులు ఆస్పత్రి బయటే అమ్మ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు తమ పూజలు ఫలించాయని వాళ్లంతా సంబరపడుతున్నారు.
 
ఎవరెవరు చూస్తున్నారంటే...
క్రిటికల్ కేర్ నిపుణులు, సీనియర్ కార్డియాలజిస్టులు, సీనియర్ రెస్పిరేటరీ ఫిజిషియన్లు, సాంక్రమిక వ్యాధుల శాఖకు చెందిన సీనియర్ కన్సల్టెంట్లు, సీనియర్ ఎండోక్రినాలజిస్టు, అపోలో ఆస్పత్రికి చెందిన డయాబెటాలజిస్టు.. వీళ్లంతా కలిసి జయలలితకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యమాంబ బులెటిన్‌లో పేర్కొన్నారు. పౌష్టికాహారం, అత్యవసరమైన న్యూట్రియెంట్ ఇన్‌టేక్ విషయాలను డయెటరీ బృందానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్లు చూసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement