ఈ - వ్యర్థాలతో అద్భుతం..!
కొత్తగా ఆలోచించే వారినే విజయం వరిస్తుందంటారు. జయంత్ విషయంలో ఇది అక్షరాల నిజం. తన తండ్రి చేసే వ్యాపారాన్ని చూసి స్ఫూర్తిపొందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు అద్భుతాన్ని సృష్టించాడు. ఇంతకి ఎవరీ జయంత్, ఏం సాధించాడు అంటారా. అరుుతే ఈ స్టోరీ చదవండి....
జయంత్ నివాసం ముంబైలోని ఘట్‌కొపర్. తండ్రి రవీంద్ర పరాబ్ పాడైపోరుున ఎలక్ట్రానిక్ వస్తువుల స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తండ్రి చేసే వ్యాపారాన్ని చూస్తూ పెరిగిన జయంత్‌కు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈ రోజు ఈ - వ్యర్థంతో కంప్యూటర్ తయారీకి నాంది పలికింది.
మూడో తరగతి నుంచే...
జయంత్ మూడో తరగతిలో ఉన్నప్పుడే స్కూల్లో కంప్యూటర్ క్లాస్‌లకు వెళ్లేవాడు. అప్పుడే జయంత్‌కు కంప్యూటర్‌లపై మక్కువ పెరిగింది. ‘ఆఫీసు, బ్యాంక్, దుకాణాల్లో ఎక్కడ చూసిన కంప్యూటర్‌లు కనిపించడంతో నా ఆసక్తి రెట్టింపు అరుుంది’అని జయంత్ చెబుతున్నాడు. ఐదో తరగతిలో స్కూల్‌లోనే కాకుండా బయట ప్రైవేటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లడం ప్రారంభించాడు. ఇక్కడే జయంత్ కంప్యూటర్ ఎలా ఉపయోగించాలన్న దానిపై పూర్తి అవగాహానను సాధించాడు.
తండ్రే తొలి గురువు..
ఈ కంప్యూటర్‌లను తయారు చేయడంలో తన తండ్రి పాత్ర ఎంతగానో ఉందటాడు జయంత్. తండ్రే గురువుగా మారి స్క్రాప్‌లో భాగంగా వచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి విడి భాగాలను ఎలా వేరు చేయాలో వివరించేవాడు. జయంత్‌లోని ఉత్సాహాన్ని చూసిన అతని తండ్రి ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్‌ను జయంత్‌కు కొనిచ్చాడు. ఇంటర్ నెట్ సదుపాయం కూడా ఉండడంతో తనకు తోచిన ప్రయోగాలను చేయడం మొదలు పెట్టాడు. ఈ - వ్యర్థాలతో కంప్యూటర్‌ను రూపొందించే క్రమంలో జయంత్ తన ఆలోచనలకు పదును పెట్టాడు.
ఈసీజీతో మానిటర్...
జయంత్ తండ్రి ఒకసారి వ్యాపారంలో భాగంగా హాస్పిటల్‌లోని పాడైపోరుున ఈసీజీని ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని పరీక్షించిన జయంత్ ఈసీజీ మిషన్‌ను మార్పుచేర్పులు చేసి ఒక మానిటర్‌ల తయారుచేశాడు. చివరగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సేకరించిన పలు వ్యర్థాలతో 9 ఇంచుల మానిటర్, 2జీబీ రామ్, 1 జీబీ హార్డ్ డిస్క్‌లతో ఒక కంప్యూటర్‌ను తయారుచేశాడు. ఇది లెనైక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీంట్లో ఇన్‌బిల్ట్ స్పీకర్లు, బ్లూటూత్, వైఫై వంటి సదుపాయాలు కూడా ఉన్నారుు. జయంత్ తయారుచేసిన ఈ కంప్యూటర్‌కు పలువురి అభినందనలతో పాటు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఒక సర్టిఫికేట్ అందజేశారు.
ఈ-వేస్ట్ సమస్యకు చెక్...
ఇలా వ్యర్థ పదార్థాలతో కంప్యూటర్‌లను రూపొందించడం వల్ల ఈ - వేస్ట్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నాడు జయంత్. ‘మొత్తం ఈ వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చు. అంతేకాకుండా దీంతో స్క్రాప్ వ్యాపారులతో పాటు చెత్త సేకరణ (రాగ్-పికర్స్) వాళ్లకు కూడా ఉపాధి కల్పించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో కూడిన కంప్యూటర్ అభివృద్ధికి కృషిచేస్తాను. ప్రస్తుత రోజుల్లో అన్ని రంగాల్లో కంప్యూటర్ వాడకం కచ్చితంగా మారిన నేపథ్యంలో తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ అందించేందకు ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు జరగాలి’ అని అంటున్నాడు జయంత్.
ఫలించిన కృషి...
జయంత్ అన్ని ఏళ్లుగా చేస్తోన్న కృషి ఎట్టకేలకు తన 17వ ఏట ఫలించింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో జరిగిన ఎగ్జిబిషన్‌లో తను ఎంతో కష్టపడి తయారుచేసిన కంప్యూటర్‌ను ప్రదర్శనకు ఉంచాడు.