
పేర్లు తెచ్చిన తంటా....విమానం వెనక్కి
ఒకరి లగేజీ బదులు మరొకరిది దించడంతో 135 మందితో ఢాకా వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానం శుక్రవారం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తిరిగొచ్చింది.
న్యూఢిల్లీ: ఒకరి లగేజీ బదులు మరొకరిది దించడంతో 135 మందితో ఢాకా వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానం శుక్రవారం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తిరిగొచ్చింది. ఫాయ్‌సోల్ ఇస్లాం లండన్ నుంచి ఢిల్లీ మీదుగా ఢాకా ప్రయాణిస్తున్నాడు. కానీ ఆయన ఢిల్లీలో ఢాకా వెళ్లాల్సిన విమానం ఎక్కలేదు.
మరో ప్రయాణికుడు పై ఇస్లాం కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో గ్రౌండ్ సిబ్బంది పొరపాటున ఫాయ్‌సోల్‌ది కాకుండా పై ఇస్లాం లగేజీని దించేశారు. నిబంధనల ప్రకారం యజమాని లేకుండా వారి వస్తువులు విమానంలో ప్రయాణించడానికి వీల్లేదు. ఈ గజిబిజి జెట్ ఏయిర్‌వేస్ దృష్టికి రావడంతో విమానాన్ని వెనక్కి మళ్లించమని పైలట్‌ను ఆదేశించారు.