జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! | JNU Planned Attack Traced | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!

Published Mon, Jan 6 2020 1:57 PM | Last Updated on Mon, Jan 6 2020 5:34 PM

JNU Planned Attack Traced - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘సాలో కో హాస్టల్‌ మే గుస్‌కే తోడే (హాస్టల్లోకి గుసాయించి కొట్టాం వారిని)’ అనే హిందీలో సందేశం ఆదివారం రాత్రి 7.03 నిమిషాలకు ఓ వాట్సప్‌ గ్రూప్‌లో కనిపించింది. దానికి సమాధానంగా అదే గ్రూప్‌ నుంచి మరొకరు ‘అవును. వారితో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తేల్చుకుంటాం. కోమియో (కమ్యూనిస్టులు) చెత్త, చెత్త ప్రచారం చేస్తున్నారు’ అంటూ స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముసుగులు, కర్రలు దరించిన కొందరు యువకులు జేఎన్‌యూ హాస్టళ్ళలోకి ప్రవేశించి కొంతమంది విద్యార్థినీ విద్యార్థులను, కొందరు ఉపాధ్యాయులను చితక బాదిన విషయం తెల్సిందే. ఆ దాడిలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ సహా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ వారు పాల్పడ్డారని విద్యార్థి కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించగా, తాము పాల్పడలేదని, వామపక్ష విద్యార్థులే పాల్పడ్డారని ఏబీవీపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. (జేఎన్‌యూలో దుండగుల వీరంగం)

ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వచ్చిన వాట్సాప్‌ సందేశాలను ‘స్క్రోల్‌ డాట్‌ ఇన్‌’ మీడియా ‘ట్రూకాలర్‌ ఆప్‌’ను ఉపయోగించి ఫోన్‌ నెంబర్లను కనుగొన్నది. వాటిని ఫేస్‌బుక్‌లో శోధించాక వారి ప్రొఫైల్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ‘సోలోంకు హాస్టల్‌ మే గుస్‌కే తోడే’ అనే సందేశం పంపిందీ సౌరవ్‌ దూబే అని తెల్సింది. ఆయన ఢిల్లీలోని షహీద్‌ భగత్‌సింగ్‌ ఈవినింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ‘జేఎన్‌యూటీస్‌ ఫర్‌ మోదీ’ అనే గ్రూపును నడుపుతున్నారు. ఆ రోజు దాడికి ముందు సాయంత్రం 5.39 గంటలకు ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆరెస్సెస్‌’ అనే వాట్సాప్‌ గ్రూపులో లెఫ్ట్‌ టెర్రర్‌కు వ్యతిరేకంగా దయచేసి ఈ గ్రూపులో చేరండి. వారిని చితక బాదాల్సిందే. అదే వారికి సరైన చికిత్స’ అని ఒకరు వ్యాఖ్యానించగా, అందుకు స్పందనగా మరొకరు ‘గెట్‌ ది పీపుల్‌ ఫ్రమ్‌ డీయూ టూ ఎంటర్‌ ఫ్రమ్‌ ఖాజన్‌ సింగ్‌ స్విమ్మింగ్‌ సైడ్‌. వియ్‌ ఆర్‌ 25,30 ఆఫ్‌ అజ్‌ ఇయర్‌’ అని స్పందించారు.(ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..)

ఇక ఇక్కడ డీయూ అంటే ఢిల్లీ యూనివర్శిటీ అని. ఖాజన్‌ సింగ్‌ స్విమ్మింగ్‌ సైడ్‌ అంటే జేఎన్‌యూలో ఖాజన్‌ సింగ్‌ స్విమ్మింగ్‌ అకాడమీ ఉంది. దానికి వేరే గేటు ఉంది. అక్కడ పెద్దగా భద్రత ఉండదు. జేఎన్‌యూ ప్రధాన గేట్‌ నుంచి వచ్చే ప్రతి విజిటర్‌ను తనిఖీ చేసే లోపలికి పంపిస్తారు. అందుకని దుండగులు ఆ స్విమ్మింగ్‌ అకాడమీ గేట్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ సందేశం పంపిందీ ‘ట్రూకాలర్‌ యాప్‌’ ద్వారా వికాస్‌ పటేల్‌దని తేలింది. ఆయన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ప్రకారం వికాస్‌ పటేల్‌ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు. జేఎన్‌యూలో ఏబీవీపీ మాజీ ఉపాధ్యక్షుడు. ‘యునిటీ అగెనెస్ట్‌ లెఫ్ట్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో అదే రోజు రాత్రి 8.41 గంటలకు ‘హాజ్‌ ది పోలీస్‌ కమ్, బ్రదర్‌. లెఫ్టిస్ట్‌ హాజ్‌ జాయిన్డ్‌ దిస్‌ గ్రూప్‌ టూ. వై వాజ్‌ ది లింక్‌ షేర్డ్‌ (బ్రదర్‌ పోలీసులు వచ్చారా? ఈ గ్రూపులో కూడా లెఫ్టిస్టులు చేరారు. ఎందుకు లింక్‌ షేర్‌ చేశారు?)’ అన్న సందేశం వచ్చింది.

కాగా ‘ట్రూకాలర్‌’ ద్వారా ఓంకార్‌ శ్రీవాత్సవ అనే వ్యక్తి ఆ సందేశాన్ని పంపించారని తెల్సింది. ఆయన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ప్రకారం ఆయన ఢిల్లీ రాష్ట్ర ఏబీవీపీ ఎగ్టిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు. జేఎన్‌యూలో 2015-16లో ఏబీవీపీ ఉపాధ్యక్షుడు. రాత్రికి రాత్రి ఈ వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఈ సందేశాలన్నింటిని డిలీట్‌ చేశారు. వాట్సాప్‌ గ్రూపుల్లో ఇతరులను కూడా చేర్చుకున్నారు. పేర్లు బయటకు వచ్చిన వీరిని మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లన్నీ స్విచాఫ్‌లో ఉన్నాయి. ఢిల్లీ పోలీసు అధికారులను సంప్రదించగా, వారు స్పందించేందుకు నిరాకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement