అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి | Judge Explains Why Stay On Nirbhaya Convicts Execution | Sakshi
Sakshi News home page

అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి

Published Fri, Jan 31 2020 8:24 PM | Last Updated on Fri, Jan 31 2020 8:41 PM

Judge Explains Why Stay On Nirbhaya Convicts Execution - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిర్భయ తల్లి, కేంద్రం ప్రభుత్వం సహా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజా పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగానే నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్తాలకు ఉరిశిక్షపై స్టే విధించినట్లు పేర్కొంది. ఈ మేరకు 10 పేజీలతో కూడిన ఆర్డర్‌ జారీ చేసింది.(నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా)

ఒక్కడినే ఎలా ఉరితీస్తారు?
నిర్భయ దోషుల ఉరిశిక్ష నిలుపుదల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ధర్మేంద్ర రానా... ‘‘ఈ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్‌(క్యూరేటివ్‌ పిటిషన్ కొట్టివేత‌, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది)కు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే మిగతా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మన దేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణ శిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముఖేష్‌ ఒక్కడినే ఉరి తీయడం సాధ్యం కాదు.

జైలు మ్యానువల్‌లోని రూల్‌ 836 ప్రకారం... ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినపుడు... ముఖ్యంగా మరణశిక్ష ఎదుర్కొంటున్నపుడు... ఒక దోషి లేదా ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ.. వారి తరఫున మరెవరైనా గానీ పిటిషన్‌ దాఖలు చేసినట్లయితే.. ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలు అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజానికి హాల్‌మార్క్‌ వంటిదని అభివర్ణించారు. (దోషుల లాయర్‌ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి)  

కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా సహా రామ్‌సింగ్‌(జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు), మరో మైనర్‌(విడుదలయ్యాడు).. పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. బాధితురాలి వాంగ్మూలం మేరకు వారిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టగా.. అనేక వాయిదాల అనంతరం సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో నలుగురు దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే ముఖేష్‌ సింగ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క్షమాభిక్ష కోరడం.. ఆయన దానిని తిరస్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలంటూ మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి దోషులు ఒక్కొక్కరుగా క్యూరేటివ్‌ పిటిషన్లు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో మరోసారి ఉరిశిక్ష వాయిదా పడింది. (నిర్భయ దోషుల ఉరిపై స్టే.. కేంద్రం ఆగ్రహం..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement