కమల్ హాసన్
సాక్షి, చైన్నై: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికలకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 104 స్థానాలతో మెజారిటీ పార్టీగా అవతరించినా బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికార ఏర్పాటుకు తగిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో యడ్యూరప్ప బల పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, బల నిరూపణ కంటే ముందే యడ్యూరప్ప శనివారం సాయంత్రం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరపున కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కుమారస్వామికి అభినందనలు తెలిపారు. తాజాగా తమిళ సినీనటుడు కమల్ హాసన్ కన్నడ రాజకీయాలపై స్పందించారు. కుమారస్వామికి ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజాస్వామ్య విజయానికి స్వాగతం. కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపేందుకు గర్విస్తున్నా. ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment