
‘కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే’
లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. కపిల్ చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలన్నారు. కేజ్రీవాల్ ఏడుగురు మంత్రుల్లో ఆరుగురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంఛాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన ఆయన ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఈ విషయాన్ని వివరించారు. తాను చేసిన ఆరోపణలు నిజాలని నిరూపించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అజయ్ మాకెన్ జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ మిశ్రా ఆరోపణలు సీరియస్‌గా తీసుకొని ఏసీబీ, సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. మరోపక్క, పాండిచ్ఛేరి గవర్నర్ కిరణ్‌బేడీ కూడా ఈ విషయంపై స్పందించారు. కేజ్రీవాల్‌పై తక్షణమే విచారణ జరపాలని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయాలన్నారు.
ఖండించిన సిసోడియా
మిశ్రా సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక సమావేశం అయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడిమా మీడియాతో మాట్లాడుతూ మిశ్రా ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఇవి చాలా దిగజారి చేస్తున్న ఆరోపణలని, తాను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాని, కేజ్రీవాల్‌పై ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ఆరోపణలే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.
‘ప్రస్తుతం నీటి సమస్యపై ప్రతి ఎమ్మెల్యే నిరాశలో ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నిన్ననే నేను మిశ్రాతో చెప్పాను. ముఖ్యమంత్రి కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని కూడా చెప్పాను. కానీ, ఆరోజు ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. ఇంకేం చెప్పాలి నేను’ అని సిసోడియా అన్నారు.