
టిప్పు సుల్తాన్ పేరును పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కర్ణాటక సీఎం స్పష్టం చేశారు.
బెంగళూర్ : పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్ పేరును తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. టిప్పు సుల్తాన్ జయంతి జరపబోమని, ఆయన పేరిట ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తామని తేల్చిచెప్పారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడన్న కొందరి వాదనతో తాను విభేదిస్తానని స్పష్టం చేశారు. నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరపరాదని తాము ఇప్పటికే నిర్ణయించామని తెలిపారు. టిప్పు సుల్తాన్ బలవంతపు మతమార్పిళ్లు, దేవాలయాల కూల్చివేత, హిందువులను వేధించడం వంటి చర్యలకు పాల్పడి వివాదాస్పద పాలకుడైనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.