కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి అరెస్ట్
- అవినీతి కేసులో ఉప కార్యదర్శి, మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ
- కాంట్రాక్టుల కేటాయింపులో అధికార దుర్వినియోగం ఆరోపణలు
- ఢిల్లీలో బీజేపీ ఓటమికి ప్రతీకారమే ఈ అరెస్టులు: ఆప్ ధ్వజం
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ సహా ఐదుగురిని సీబీఐ సోమవారం అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. ఒక ప్రైవేటు కంపెనీకి రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను అప్పగించటంలో అక్రమంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రాజేంద్రకుమార్ తదితరులను సీబీఐ అరెస్ట్ చేయగా.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినందుకు ప్రధానమంత్రి మోదీ తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజమెత్తింది. ‘మోదీ గారూ, మాకు కేవలం ప్యూన్లు మాత్రమే మిగిలేలా చేసినా.. వారితో మేం ప్రభుత్వాన్ని నడుపుతాం’ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.
కేజ్రీవాల్ కార్యాలయంలో ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణ్‌శర్మ, మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులతో పాటు రాజేంద్రకుమార్‌ను కూడా సోమవారం ఉదయం విచారణ నిమిత్తం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మధ్యాహ్నం వరకూ వారిని ప్రశ్నించిన తర్వాత.. రాజేంద్రకుమార్, తరుణ్‌శర్మలతో పాటు రాజేంద్ర సన్నిహితుడు అశోక్‌కుమార్, ప్రైవేటు సంస్థ యజమానులు సందీప్‌కుమార్, దినేశ్‌గుప్తాలను అరెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వ టెండర్లు ఐదింటిని దక్కించుకోవటానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజేంద్రకుమార్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని గత ఏడాది డిసెంబర్‌లో సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులు నేరపూరిత కుట్రలో చేరి ఢిల్లీ ప్రభుత్వానికి 2007- 2015 మధ్య కాంట్రాక్టుల కేటాయింపులో రూ. 12 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపించింది.
నిందితులైన అధికారులు ఆ కాంట్రాక్టు కేటాయించే క్రమంలో రూ. మూడు కోట్లకు పైగా అనుచిత లబ్ధి పొందారనీ ఆరోపించింది. అరెస్టు చేసిన నిందితులను మంగళవారం కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీబీఐ తెలిపింది. ఈ పరిణామాలపై సిసోడియా స్పందిస్తూ.. ‘సీఎం ఆఫీసును స్తంభింపజేసే కుట్ర జరుగుతోంది. సీఎం ముఖ్యకార్యదర్శి, ఉప కార్యదర్శులను అరెస్ట్ చేశారు. సహాయ కార్యదర్శిని అండమాన్‌కు బదిలీ చేశారు. ఇదంతా కేవలం ఒక్క రోజులో జరిగింది. ఢిల్లీలో 1991లో ఒక ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ.. కేంద్ర ప్రభుత్వం దిగజారిన అత్యంత అధమ స్థాయి ఇదే’ అని అన్నారు.