ఎల్జీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఘాటు లేఖ | Kejriwal Urged LG Anil Baijal To Implement The Apex Courts Order | Sakshi
Sakshi News home page

ఎల్జీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఘాటు లేఖ

Published Mon, Jul 9 2018 3:58 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Kejriwal Urged LG Anil Baijal To Implement The Apex Courts Order - Sakshi

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీం కోర్టు విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చినా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజల్‌ల మధ్య వివాదానికి మాత్రం తెరపడలేదు. కోర్టు తీర్పును అంగీకరించడంలో ఎల్జీ తనకు నచ్చిన రీతిలో ఎలా వ్యవహరిస్తారని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును తమకు నచ్చిన మేరకే అన్వయించుకోవడంపై ఎల్జీ బైజల్‌కు సోమవారం రాసిన లేఖలో కేజ్రీవాల్‌ విస్మయం వ్యక్తం చేశారు.

 కోర్టు తీర్పు ప్రతిలోని ఈ పేరాను తాను అంగీకరిస్తానని, అదే ఉత్తర్వుల్లోని మరో పేరాను అంగీకరించనని మీరెలా చెబుతారంటూ నిలదీశారు. సుప్రీం ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. ఈ ఉత్తర్వుల్లో తలదూర్చే అధికారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేదని స్పష్టం చేశారు. సుప్రీం ఉత్తర్వుల్లో ఏమైనా సందేహాలుంటే తక్షణమే న్యాయస్ధానాన్ని వివరణ కోరాలని, సర్వోన్నత న్యాయస్ధాన ఉత్తర్వులను మాత్రం ఉల్లంఘించవద్దని ఎల్జీకి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవని సుప్రీం కోర్టు గత వారం చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ నిర్ణయాలకు అనుగుణంగా ఎల్జీ పనిచేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లేనందున ఎల్జీ అవరోధాలు సృష్టించేలా వ్యవహరించరాదని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement