కార్యవర్గ భేటీకి కేజ్రీవాల్ దూరం
అనారోగ్యమే కారణం
10 రోజులపాటు బెంగళూరులో నేచురోపతి చికిత్స తీసుకోనున్న సీఎం
ఆప్‌లో ముదురుతున్న అంతర్గత కలహాలు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ భేటీకి పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా ఈ భేటీకి రాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ సమాచారమిచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పది రోజులపాటు నేచురోపతి చికిత్స తీసుకునేందుకు ఆయన బెంగళూరు వెళ్లనున్నారని తెలిపాయి. ఒత్తిడి కారణంగా కేజ్రీవాల్ దేహంలో షుగర్ స్థాయి బాగా పెరిగిందని, మాత్రలు, ఇన్సులిన్ తీసుకున్నా.. నియంత్రణలోకి రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ఇంటిపోరుతో అతలాకుతలమవుతోన్న ఆప్ నాయకత్వం... జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఉద్వాసన పలకడానికి అరవింద్ కేజ్రీవాల్ వర్గం రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ భూషణ్‌పై కేజ్రీవాల్ వర్గం విమర్శల దాడి పెంచింది. ‘శాంతి భూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్, కుమార్తె షాలిని భూషణ్ పార్టీలోని అన్ని విభాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఏక వ్యక్తి పార్టీగా ఉండకూడదని చెబుతున్న వీరు ఆప్‌ను వారి కుటుంబ పార్టీగా చేయాలని చూస్తున్నారు’ అని ఆప్ నేత ఆశీష్ ఖేతాన్ మండిపడ్డారు. కాగా, కేజ్రీవాల్‌పై ఇటీవలి వరకు విమర్శలు కురిపించిన ఆప్ వ్యవస్థాపక సభ్యుడు శాంతిభూషణ్ మాట మార్చారు. కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగాలని, యోగేంద్ర, ప్రశాంత్ లు ఆయనకు సహకరించాలని సూచించారు. తనపై వస్తున్న ‘కుట్ర’ ఆరోపణలను యోగేంద్ర కూడా తోసిపుచ్చారు. కేజ్రీవాలే పార్టీని నడపాలని కోరుకున్నామని, కన్వీనర్ పదవి నుంచి ఆయన వైదొలగాలని తాను ఎన్నడూ అనలేదన్నారు. పీఏసీ నుంచి తొలగిస్తారని వస్తున్న వార్తలను ప్రస్తావించగా... ‘అందుకు నేను, ప్రశాంత్ భూషణ్ ఎప్పుడూ రెడీగానే ఉంటాం’అని చెప్పారు.
ఆ మురికిలోకి దిగదల్చుకోలేదు: కేజ్రీవాల్
పార్టీలో అంతర్గత కలహాలపై కేజ్రీవాల్ పెదవి విప్పారు. ఈ గొడవలు తనను బాధించాయని, ఆ మురికి యుద్ధంలోకి తాను దిగదల్చుకోలేదని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఇలా గొడవ పడడం ఢిల్లీవాసులు పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమేనన్నారు. ‘గొడవలోకి దిగను. ఢిల్లీ పాలనపైనే నా దృష్టి నిలుపుతా. ఎట్టిపరిస్థితుల్లో కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వబోం’’ అని కేజ్రీవాల్ అన్నారు.